రాఖీ పండుగ రోజు టీఎస్ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం

నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న టీఎస్ ఆర్టీసీకి రాఖీ పండగ భారీగా ఆదాయం తెచ్చిపెట్టింది. రాఖీ రోజు ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆర్టీసీ లో రాకపోకలు సాగించడంతో శుక్రవారం ఒక్క రోజే రూ.20.11 కోట్ల ఆదాయం టికెట్ల రూపంలో వచ్చింది. సంస్థ చరిత్రలో ఒక రోజు రూ.20 కోట్లు రావడం ఇదే తొలిసారి. అధికారులు రూ.15.59 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకోగా, దీన్ని మించి వసూళ్లు కావడంతో ఆర్టీసీ అధికారులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఆర్టీసీ రెండు పర్యాయాలు భారీగా చార్జీలను పెంచింది. అలాగే లగేజీ చార్జీలను కూడా సవరించింది. గతంతో పోలిస్తే మొత్తం మీద ఈ పెంపు 30 శాతం వరకు ఉంది. దీంతో లాభాల బాట పట్టింది.

ఇటీవల కాలంలో టీఎస్ ఆర్టీసీ భారీగా ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతి పండగకు ఏదోరకంగా ఆఫర్ ఇస్తూ వస్తుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు శుభవార్త తీసుకొచ్చింది. రాఖీ పౌర్ణమి రోజున మహిళలు వారి సోదరులకి స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని పరిస్థితులు ఉంటే.. టీఎస్ ఆర్టీసీ కార్గో, పార్సిల్‌ సర్వీసుల ద్వారా.. అతి తక్కువ ధరలకే రాఖీలను పంపించుకోవచ్చని ప్రకటించింది. టీఎస్ ఆర్టీసీ కార్గో, పార్సిల్‌ సర్వీసుల ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో డోర్ డెలివరీ సదుపాయం కల్పించింది. దీనిని చాలామందే ఉపయోగించుకున్నారు.

ఈ ఆగస్టు 15న పుట్టిన పిల్లలు 12 ఏళ్ల పాటు ఉచిత ప్రయాణం కల్పిస్తూ ప్రకటించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను స్వతంత్ర వజ్రోత్సవాలుగా పేర్కొంటూ 12 రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఆర్టీసీ నిర్ణయించింది. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఆగస్టు 15న పుట్టిన పిల్లలు 12 ఏళ్ల పాటు ఉచిత ప్రయాణం కల్పించేలా సరికొత్త ఆఫర్​ను ప్రకటించింది.

ఆగస్టు 15వ తేదీన పుట్టిన చిన్నారులందరికీ వారికి 12 ఏళ్లు పూర్తి అయ్యేంత వరకు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. అదేవిధంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులు ఈ నెల 15న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. వీటితో పాటు టీ-24 బస్‌ టికెటును ఆ రోజున రూ.75( సాధారణ రోజుల్లో రూ.120)కే అందిస్తామని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.