నా తమ్ముడికి ఓటెయ్యండి – ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్

మునుగోడు ఉప ఎన్నిక వేడి ఎలా కొనసాగుతుందో తెలియంది కాదు..ప్రధాన పార్టీ నేతలంతా మునుగోడు ప్రచారంలో బిజీ బిజీ గా ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే తన తమ్ముడికి ఓటు వేయాలని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మద్దతు కోరినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఫోన్ కాల్ లీక్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ని షాక్ లో పడేసింది.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సొంత పార్టీ నాయకుడితో ఫోన్ లో మాట్లాడుతూ..మునుగోడు లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని గెలిపించి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడిస్తే ఆ తర్వాత తను టిపిసిసి ప్రెసిడెంట్ అవుతానంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ఫోన్ కాల్ లో మాట్లాడినట్టు ఆ ఆడియో కాల్ ని బట్టి అర్థమవుతుంది. ఆ తర్వాత తను రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తానని అందులో పేర్కొన్నారు. ఏదైనా ఉంటే తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు. చచ్చినా, బతికినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తూ ఉంటారని, ఉప ఎన్నికలో ఓటు ఆయనకే వేయాలని ఫోన్ కాల్ రిక్వెస్ట్ చేశారు. కాంగ్రెస్ లీడర్ తోవెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

ఈ ఆడియో ఫై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి తనపై కుట్ర జరుగుతోందని, మునుగోడు లో కాంగ్రెస్ పార్టీని ఓడించి తనను టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించే ప్రయత్నం సొంత పార్టీ నేతలు చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ అవడంతో, అందులో ఆయన టీపీసీసీ పదవి గురించి మాట్లాడటంతో కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా సాగుతున్న వర్గపోరు మరోమారు బయటకు వచ్చింది.