ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్

ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సాయిబాబాను నిర్ధోషిగా తెలుస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చి 24 గంటలు గడవకముందే సాయిబాబాకు షాక్ ఇచ్చింది సుప్రీం కోర్ట్. సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దీనిపై సుప్రీంకోర్టు శనివారం ప్రత్యేకంగా విచారణ జరిపింది.

చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం సాయిబాబాను విచారించడానికి ముందుగా అనుమతి పొందలేదనే కారణాన్ని చూపి, సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించడం సమంజసం కాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు లో వాదించారు. కేసులోని యథార్థాలను పరిశీలించకుండా, కేవలం సాంకేతిక అంశాల ఆధారంగానే హైకోర్టు తీర్పు చెప్పిందన్నారు. యూఏపీఏ చట్టం ప్రకారం అనుమతి పొందకపోవడంపై సాయిబాబా ట్రయల్ కోర్టులో కానీ, ఇతర కోర్టుల్లో కానీ సవాల్ చేయలేదన్నారు. సాయిబాబాను కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆయన బెయిలు కోసం దరఖాస్తు చేశారని, అయితే ఆయనకు బెయిలు మంజూరు చేసేందుకు కోర్టు తిరస్కరించిందని చెప్పారు. తదుపరి విచారణ కోసం నోటీసులు జారీ చేస్తామని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం తెలిపింది. బాంబే హైకోర్టు తీర్పును నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది.

మావోలతో లింకు ఉన్న కేసులో ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం ముంబై హైకోర్టుకు చెందిన నాగపూర్‌ బెంచ్‌ ఆ కేసులో ప్రొఫెసర్‌ సాయిబాబను నిర్ధోషిగా తేల్చింది. తక్షణమే ఆయన్ను జైలు నుంచి రిలీజ్‌ చేయాలని ఆదేశించింది. జస్టిస్‌ రోహిత్‌ డియో, అనిల్‌ పన్సరేలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. 2017లో ట్రయల్‌ కోర్టు సాయిబాబను దోషిగా తేల్చి జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది. ఆ తీర్పును ప్రొఫెసర్‌ సాయిబాబ సవాల్‌ చేశారు. ప్రస్తుతం శరీరం క్షీణించడం వల్ల అతను వీల్‌చైర్‌పై ఉంటున్నాడు. నాగపూర్‌లోని సెంట్రల్ జైలులో అతను శిక్షను అనుభవిస్తున్నాడు. ఇదే కేసుతో లింకు ఉన్న మరో అయిదుగురిని కూడా నిర్ధోషులుగా ప్రకటించారు. ఓ వ్యక్తి మాత్రం కేసు విచారణ సమయంలో ప్రాణాలు కోల్పోయారు. ఒకవేళ వీళ్లంతా మరో కేసులో లేకుంటే వాళ్లను వెంటనే రిలీజ్‌ చేయాలని బెంచ్‌ ఆదేశించింది.