14 ఏళ్ల బాలిక‌కు సుప్రీంలో ఊర‌ట‌..అబార్షన్‌కు అనుమతి

Supreme Court allows 14-year-old rape survivor to abort 30-week pregnancy

న్యూఢిల్లీః ఓ 14 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురవడం వల్ల గర్భం దాల్చిన అబార్షన్ కు సుప్రీంకోర్టు సోమవారం అనుమతి నిచ్చింది. తన కుమార్తెకు అబార్షన్ చేయించేందుకు బాంబే హైకోర్టు అనుమతి నిరాకరించడంతో బాధితురాలి తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వైద్యపరంగా అబార్షన్ చేసేందుకు ఉన్న నిర్ణీత కాల వ్యవధి దాటిపోవడంతో బాధితురాలి అబార్షన్ ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. అయితే ఆ బాలిక ఆరోగ్య పరిస్థితిని పరీక్షించాల్సిందిగా ఈ నెల 19న జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించింది.

తాజా విచారణ సందర్భంగా వైద్య నివేదికలో డాక్టర్లు పేర్కొన్న అంశాలను సర్వోన్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. గర్భాన్ని కొనసాగిస్తే అది ఆ బాలిక శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వైద్య నివేదికలో డాక్టర్లు అభిప్రాయపడ్డారు. దీంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం బాలిక అబార్షన్ కు గ్రీన్ ఇగ్నల్ ఇచ్చింది.

అంతకుముందు ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. రేప్ బాధితురాలు ప్రస్తుతం 30 వారాల గర్భంతో ఉందని, ఆమె ముంబైలో నివసిస్తోందని చెప్పారు. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం పెళ్లయిన మహిళలతోపాటు రేప్ బాధితులు, మైనర్లు, దివ్యాంగులు 24 వారాల్లోగా తమ గర్భాన్ని అబార్షన్ ద్వారా తొలగించుకొనే వీలుంది.