హైదరాబాద్‌లో సన్‌బర్న్‌ కార్యక్రమం రద్దు

ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయాలు నిలిపివేత

Sunburn program canceled in Hyderabad

హైదరాబాద్‌: కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నిర్వహించ తలపెట్టిన సన్‌బర్న్‌ ఈవెంట్‌ను నిర్వాహకులు రద్దుచేశారు. బుక్‌మై షోలో దీనికి సంబంధించిన టికెట్ల అమ్మకాలను నిలిపివేసింది. ఈ వ్యవహారంపై ఈవెంట్‌ నిర్వాకుడు సుమంత్‌పై పోలీసులు కేసు నమోదుచేశారు. అదేవిధంగా అనుమతి లేకుండా టికెట్లు విక్రయిస్తున్న బుక్‌మై షో, నోడల్‌ అధికారులకు సైబరాబాద్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో బుక్‌మై షోలో సన్‌ బర్న్‌ షో ప్లాట్‌ఫామ్‌పై హైదరాబాద్‌ ఈవెంట్‌ కనిపించడం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈవెంట్‌ టికెట్లు మాత్రం అమ్మకానికి పెట్టారు.

సన్‌బర్న్‌ ఈవెంట్‌ నిర్వాహకులు సన్‌బర్న్‌ మ్యూజికల్‌ నైట్‌ పేరిట న్యూఇయర్‌ ఈవెంట్‌ నిర్వహణ కోసం దరఖాస్తు చేసుకున్నారని, అయితే వారి దరఖాస్తు ఇంకా పరిశీలనలోనే ఉందని మాదాపూర్‌ అదనపు డీసీపీ నర్సింహా రెడ్డి అన్నారు. కానీ ఈవెంట్‌కు సంబంధించిన టికెట్లను విక్రయించినట్లు తమకు ఫిర్యాదు అందిందని చెప్పారు. ఈ మేరకు అనుమతి రాకముందే బుక్‌ మై షోలో టికెట్లు విక్రయించినట్లు తమ విచారణలో వెల్లడయిందన్నారు. పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే రూ.1499 ప్రారంభ ధర నుంచి రూ. 4999 చొప్పున టికెట్లు విక్రయించడం చట్ట విరుద్ధమని, దీంతో సన్‌బర్న్‌ ఈవెంట్‌ ఆర్గనైజర్‌ సుమన్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు అదనపు డీసీపీ వెల్లడించారు. ఇప్పటికే ఈవెంట్‌ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశామని, అనుమతి లేని ఈవెంట్‌కు సంబంధించిన టికెట్ల జారీకి సహకరించిన బుక్‌ మై షో నోడల్‌ ఆఫీసర్‌, ఎండీలకు సైతం నోటీసులు జారీ చేశామని తెలిపారు.