ప్రధాన మంత్రి అభ్యర్థిత్వంపై నా కెలాంటి ఆసక్తి లేదుః బిహార్ సీఎం నీతీశ్‌

I have no interest in PM candidature: Bihar CM Nitish

న్యూఢిల్లీః విపక్ష కూటమి ‘ఇండియా’కు ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును కొందరు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే ఈ పదవి మీద కూటమిలో చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. వారిలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ కూడా ఉన్నారు. అయితే కూటమిలో చాలా మంది మల్లికార్జున ఖర్గేను పీఎం అభ్యర్థిగా ప్రతిపాదించారు. దీనిపై తాజాగా నీతీశ్ కుమార్ స్పందించారు.

ఖర్గేను పీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై తనకెలాంటి అభ్యంతరం లేదని నీతీశ్‌ కుమార్‌ అన్నారు. ప్రధాన మంత్రి అభ్యర్థిత్వంపై తనకెలాంటి ఆసక్తి లేదని మొదట్లోనే చెప్పానని తెలిపారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గేను ప్రధాని పదవికి సూచించడంపై తనకు కోపం రాలేదని చెప్పారు. దీనివల్ల తాను ఏ మాత్రం నిరాశ చెందలేదని వివరించారు. అయితే సీట్ల సర్దుబాటును త్వరగా పూర్తి చేయాలని భాగస్వామ్య పక్షాలను కోరినట్లు మాత్రం చెప్పానని నీతీశ్ వెల్లడించారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టడమే తన లక్ష్యమన్న నీతీశ్.. తమ కూటమిలో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు.