రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం

మౌలిక వసతుల కోసం రూ.20 కోట్ల దాకా వెచ్చించనున్న రైల్వే శాఖ

Railways Ministry announces ‘Amrit Bharat’ scheme for modernisation of stations

న్యూఢిల్లీః దేశంలోని చిన్న రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఆయా రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలను ఈ పథకం కింద అభివృద్ధి చేయనుంది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పేరుతో వెయ్యి ముఖ్యమైన చిన్న రైల్వేస్టేషన్లను ఆధునికీకరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ పథకం కింద ఒడిశాలోని ఖుర్దా జంక్షన్‌ను అభివృద్ధి చేసినట్లు రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. ఈ పథకంలో భాగంగా.. స్టేషన్ లో ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించాయి. ఏడాది, ఏడాదిన్నరలోగా ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాయి.

రైల్వేలోని 68 డివిజన్ల పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న 200 ప్రధాన రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు అదనంగా చిన్న స్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. స్టేషన్ల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపకల్పన, దశలవారీగా సౌకర్యాలను మెరుగుపరచడం, హై లెవల్ ప్లాట్ ఫారమ్ ల ఏర్పాటు, వెయిటింగ్ రూమ్ ల ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నట్లు తెలిపింది. స్టేషన్‌ బయట ప్రణాళికబద్ధమైన పార్కింగ్, లైటింగ్‌ వ్యవస్థను మెరుగుపర్చడం, రైళ్ల రాకపోకలను తెలిపే డిజిటల్‌ బోర్డులు, దివ్యాంగులకు అవసరమైన సౌకర్యాల కల్పన తదితర ఏర్పాట్లను ఈ పథకం కింద చేపట్టనుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/