సంజయ ఉవాచ

ఆధ్యాత్మిక చింతన

Srimadbhagavadgita
Srimadbhagavadgita

శ్రీమద్భగవద్గీతలో అర్జున ఉవాచ, సంజయ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ అని ఉన్నదాన్ని కూడా భగవద్గీత అనే చాలా మంది అనుకుంటారు. కాదు. భగవాన్‌ ఉవాచ అని ఉన్నదే శ్రీకృష్ణ భగవానుని బోధ. అలాగే శ్రీమద్రామాయణంలో కూడా ఎందరెందరో సందర్భానుసారంగా ఏమోమో చెబుతారు.

దాన్నంతా కూడా రామాయణ బోధ అని కానీ, వాల్మీకి మహర్షి బోధ అని కానీ మనం భ్రమ పడరాదు.

వాల్మీకి మహర్షి ఎవరెవరు ఏమన్నారో దాన్ని రాశాడు అంతే. అందరూ చెప్పేదీ విని నేటి కాల పరిస్థితులకు ఉపయోగకరమైనవేవో, అన్ని కాలాలకు పనికివచ్చేవేవో మన వివేకాన్ని వినియోగించి గ్రహించాలి. ఆచరించాలి.

హిందూమత గ్రంథాలకు అపఖ్యాతి తెచ్చే విధంగా మన జీవితముండరాదన్నదే తాపత్రయమంతా. ‘బుద్ధిశాలివైన ఓ రామా! పరం అంటూ ఏమీలేదు. ప్రత్యక్షంగా చూసేదే యదార్థం. కనుక ప్రత్యక్షంగా కనిపిస్తున్న రాజ్యాన్ని అనుభవించు.

ఊహల్లో మాత్రమే ఉంటూ ఉన్మాదుల్ని చేసే పరాన్ని గురించి మరిచిపో, భరతుడు నిన్ను ఇంతగా బ్రతిమాలుతున్నాడు. నేను చెప్పిన మార్గాన్ని అంగీకరించి నీవ్ఞ రాజ్యాన్ని తీసుకో అని అంటాడు జాబాలి మహర్షి.

ఆయన సామాన్యుడు కాడు, బ్రాహ్మణోత్తముడు. దీనిని నిజంగా మనం అనుసరించవలసిన బోధగా, వాల్మీకి బోధగా, రామాయణ బోధగా తీసికొంటే రామాయణానికి తీరని అపచారం చేసిన వారమే అవ్ఞతాం.

ఆ మాటలను వినిన శ్రీరామచంద్రుడు ఏమని బదులు చెబుతాడో దాన్ని చూద్దాం. ఓ జాబాలీ! లోకంలో సత్యమే ఈశ్వరుడు.

లక్ష్మి ఎల్లప్పుడూ సత్యాన్నే ఆశ్రయించి ఉంటుంది. అంటే అన్నింటికీ సత్యమే మూలం. సత్యాన్ని మించిన ఉత్తమ ధర్మం ఇంకొకటి ఎక్కడా లేదు.

దానం, యాగం, తపస్సు, వేదాలు అన్నీ సత్యం మీదనే ఆధారపడి ఉన్నాయి. అందుచేత మానవ్ఞడికి సత్యమే పమరధర్మం..

నా తండ్రి ఎదుట సత్యంపై ప్రతిజ్ఞ చేసాను. సత్యమైన ఆ ప్రతిజ్ఞను పాలించకుండా ఎలా ఉండగలను? సత్యసంధుడు కానివాడు యజ్ఞాయాగాల్లో ఇచ్చే హవ్యకవ్యాదుల్ని దేవతలు, పితృదేవతలు కూడా స్వీకరించరు.

సత్యమైన ఈ ధర్మమే ప్రత్యగాత్మ అని అనుకొంటున్నాను. అందువల్లనే మహాత్ములైన వారందరూ ఆచరించిన ఈ కష్టసాధ్యమైన సత్యవ్రతాన్ని నేను గౌరవిస్తున్నాను. సత్యవ్రతులైన పూర్వరాజర్షులు ఆచరించిన మార్గాన్నే నేనూ అవలంభిస్తాను.

‘సత్యమే దేవ్ఞడు అని చెప్పే నేటి గాంధీజీ బోధకుగానీ, వేల యేండ్ల కింద శ్రీరాముడు చేసిన బోధకు గానీ ఏమి భేదముంది?

ఇంతకూ వారిద్దరి దృష్టిలో సత్యవ్రతమంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం, చేసిన ప్రతిజ్ఞలను నెరవేర్చటమే కానీ మనలాగా సత్యనారాయణస్వామి వ్రతాలను చేస్తూ అబద్ధాలనాడటం, ఇచ్చిన మాట తప్పటం కాదు.

సత్యనారాయణస్వామి వ్రతాన్ని చేయటం సులభమే. సత్యవ్రతాన్ని ఆచరించటమే శ్రీరాముడు చెప్పినట్లు కష్టం.

అయినా తండ్రికిచ్చిన మాటను నెరవేర్చాడు కాబట్టే ఆయన ఆదర్శ పురుషుడయ్యాడు. తల్లికిచ్చిన వాగ్దానాలను అమలు చేశాడు కాబట్టే గాంధీ ‘మహాత్మాగాంధీ అయ్యాడు.

సత్యనారాయణస్వామి వ్రతాన్ని చేయటం మంచిదే. కానీ మనం చేసే ప్రతి సత్యనారాయణస్వామి వ్రతం సత్యానికి కట్టుబడి ఉంటాలనే సంకల్పాని మనలో దృఢపరచాలి.

అదే సత్యనారాయణుని పట్ల శ్రీరామచంద్ర ప్రభువ్ఞ పట్ల మనకున్న భక్తిని సూచిస్తుంది.

- రాచమడుగు శ్రీనివాసులు 

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/