శ్రీలంకలో 36 గంటల కర్ఫ్యూ

శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం..వెల్లువెత్తిన ప్రజాగ్రహం

కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అత్యంత తీవ్రరూపు దాల్చింది. ధరలు ఆకాశాన్నంటుతుండడం, నిత్యావసరాల కొరత, ద్రవ్యోల్బణం వంటి అంశాలతో లంకేయులు అల్లాడిపోతున్నారు. క్రమంగా దేశంలో అరాచక పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తుండడంతో శ్రీలంక ప్రభుత్వం తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో దేశంలో 36 గంటల లాక్ డౌన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల అస్థిరత రాజ్యమేలుతుండడంతో ఈ కర్ఫ్యూ నిర్ణయం తీసుకుంది. శనివారం సాయంత్రం నుంచి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. సోమవారం ఉదయం కర్ఫ్యూ ఎత్తివేయనున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కర్ఫ్యూ విధించినట్టు తెలుస్తోంది. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇప్పటికే దేశంలో అత్యయిక పరిస్థితి విధించడం తెలిసిందే.

కాగా, ప్రభుత్వ అసమర్థ విధానాలే శ్రీలంక దుస్థితికి కారణమని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఏళ్ల తరబడి నుంచి విచ్చలవిడిగా చేసిన అప్పులు, అనాలోచిత పన్ను రాయితీలు, కరోనా సంక్షోభం శ్రీలంక ఆర్థిక వ్యవస్థను చావుదెబ్బ కొట్టాయని వివరించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/