విజయవాడ కలెక్టరేట్ ఆఫీస్ లో సిబ్బందిని పరుగులు పెట్టించిన నాగరాజు

గురువారం విజయవాడలోని కలెక్టరేట్ ఆఫీస్ లోకి అనుకోని అతిధి వచ్చింది…వచ్చి రావడమే సిబ్బందిని పరుగులుపెట్టించింది. ఆ అతిధిని బయటకు పంపేంచేందుకు సిబ్బందికి చెమటలు పట్టాయి. ఇంతకీ ఆ అతిధి ఎవరా అనుకుంటున్నారా..నాగుపాము. అవును నాగుపామే వచ్చింది. జిల్లా కలెక్టరేట్ లోని రెవెన్యూ అధికారి చాంబర్ పక్కనే ఇతర ఉద్యోగుల క్యాబిన్ ఉంది. ఆ చాంబర్ వెనుక ముళ్ల పొదలు ఉండడంతో, అందులోంచి ఒక నాగుపాము ఉద్యోగుల క్యాబిన్లోకి ప్రవేశించింది. 4 అడుగుల పొడవున్న ఆ పామును చూడగానే ఉద్యోగులు భయంతో పరుగులు పెట్టారు.

ఉద్యోగుల హడావిడి తో పాము ఆ క్యాబిన్లోనే ఉండిపోయింది. దాంతో కలెక్టరేట్ అధికారులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ఆ ప్రమాకరమైన నాగుపామును ఎంతో నేర్పుగా పట్టుకున్నారు. అనంతరం దాన్ని అక్కడి నుంచి తరలించడంతో, ఉద్యోగులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.