ఎన్డీయే అభ్యర్థికి ఓటేసిన సీతక్క..

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క..విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు ఓటు వేయబోయి పొరపాటున బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్మూకు ఓటు వేశారు. దేశవ్యాప్తంగా సోమవారం రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. తెలంగాణ శాసనసభలోని కమిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఓటువేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సీతక్క వంతు వచ్చింది.

ఈ సందర్భంగా ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క.. ఓటింగ్‌లో భాగంగా తప్పిదం చేశారు. ప్రతిపక్షాల బలపరిచిన యశ్వంత్‌ సిన్హాకు కాకుండా ఎన్డీయే బలపరచిన ద్రౌపది ముర్ముకు ఆమె ఓటేశారు. కాగా, తాను పొరపాటున ముర్ముకు ఓటు వేసినట్టు అధికారులకు సీతక్క తెలిపారు. ఈ క్రమంలో మళ్లీ ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను కోరింది. కాగా, నిబంధనల ప్రకారం మరోసారి అవకాశం ఇవ్వలేమని అధికారులు సీతక్కకు చెప్పారు. అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బ్యాలెట్‌ పేపర్‌ను డ్రాప్‌ బాక్స్‌లో వేయకుండా అక్కడినుంచి వెళ్లిపోయారు. అధికారుల తుది నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని సీతక్క మీడియాకు తెలిపారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతిస్తున్న విషయం తెలిసిందే. మరి నిజగానే ఇది పొరపాటున జరిగిందా..లేక అణగారిన వర్గాలకు చెందిన మహిళ అనే సానుభూతితో ద్రౌపది ముర్మూకు సీతక్క ఓటు వేసారా అని అంత మాట్లాడుకుంటున్నారు. కాగా, ఇప్పటివరకు 99 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి కూడా ఇక్కడే తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.