తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా సీతక్క..?

తెలంగాణ లో రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. సీఎం గా రేవంత్ తన మార్క్ కనపరుస్తూ వస్తున్నాడు. మొన్నటి వరకు లోక్ సభ ఎన్నికలతో బిజీ గా ఉన్న రేవంత్..ఇక ఇప్పుడు పాలన ఫై పూర్తి దృష్టి పెట్టారు. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

రేవంత్ సీఎం అయిన తరువాత పీసీసీ చీఫ్ గా మరొకరికి అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన పైన చర్చ జరిగింది. అయితే, పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకూ పీసీసీ చీఫ్ పదవిలోనూ కొనసాగాలని పార్టీ నాయకత్వం రేవంత్ కు నిర్దేశించింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావటంతో నూతన పీసీసీ చీఫ్ పదవి ఎంపిక పైన కసరత్తు మొదలైంది. రేవంత్ ను సీఎంగా చేసే సమయంలో భట్టికి డిప్యూటీ సీఎం తో పాటుగా పీసీసీ చీఫ్ పదవి పైన హామీ లభించినట్లు ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు రేవంత్ కేబినెట్ మొత్తం కలిసి కట్టుగా పని చేస్తోంది.

పీసీసీ పదవి కోసం సీనియర్ నేతలు జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీలు పీసీసీ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ, అనూహ్యంగా రేవంత్ ఛాయిస్ గా మంత్రి సీతక్క పేరు తెర మీదకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. గిరిజన మహిళకు పీసీసీ పగ్గాలు అప్పగించటం ద్వారా సానుకూలత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పీసీసీ పదవి కోసం పోటీ పడుతున్న నేతలు సైతం సీతక్కను ఎంపిక చేస్తూ సహకారం అందిస్తారని భావిస్తున్నారు. సీతక్క పైన పార్టీలో అందరికి సదభిప్రాయం ఉంది. పార్టీ కోసం కష్టపడి పని చేస్తారనే నమ్మకంతో పాటుగా రేవంత్ కు నమ్మినబంటుగా పేరుంది అందుకే ఆమెకే మొగ్గు చూపిస్తున్నట్లు వినికిడి. మరి పీసీసీ పదవి ఇస్తే..మంత్రి గా కొనసాగిస్తారా..? లేక తొలగిస్తారా..? అనేది చూడాలి.