మీ అచంచల ధైర్యసాహసాలు కొనసాగిస్తారని ఆశిస్తున్నానుః షర్మిల

మళ్లీ పార్లమెంటులో అడుగుపెట్టిన రాహుల్ గాంధీ

sharmila-greets-rahul

హైదరాబాద్‌ః గుజరాత్ న్యాయస్థానం విధించిన జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించడం తెలిసిందే. దీనిపై వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. తిరిగి పార్లమెంటు సభ్యత్వాన్ని పొందిన రాహుల్ గాంధీకి హార్దిక శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ట్వీట్ చేశారు. “కోట్లాది మంది ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురింపజేసేందుకు మీ అచంచలమైన ధైర్యసాహసాలు కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. న్యాయం తన పని తాను చేసుకుపోతూ, అనేక హృదయాలను సంతోషానికి గురిచేసేలా ఈ తీర్పు ఇచ్చింది.

మీరు మరోసారి పార్లమెంటులో అడుగుపెట్టడం వల్ల దేశ ప్రజల సమస్యలపై సుదీర్ఘ పోరాటం ఖాయమని నేను కచ్చితంగా చెప్పగలను. ఈ నేపథ్యంలో నేను అందరు నాయకులకు విజ్ఞప్తి చేసేది ఒక్కటే. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాద పునరుద్ధరణకు చేతులు కలపండి. అణచివేతకు గురవుతున్న ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని కాపాడేందుకు, పునరుజ్జీవింపజేసేందుకు జరిగే పోరాటంలో ఇది కీలక పరిణామం కావాలి. పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి నా నైతిక మద్దతు తెలుపుతున్నాను” అని షర్మిల వివరించారు.