ఏపీలో 9 గ్యారెంటీలను తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ

Sharmila announced 9 guarantees of the ap Congress party

అమరావతిః : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి 10 ఏళ్ల ప్రత్యేక హోదా ఇస్తుందని ఏపీసీసీ చీఫ్​ షర్మిల తెలిపారు. ప్రతి మహిళకూ ఏడాదికి లక్ష ఇచ్చేలా మహాలక్ష్మి పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. విజయవాడలో గడప గడపకు కాంగ్రెస్​ కార్యక్రమం కోసం నేతలు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేతలు పల్లం రాజు, రఘు వీరారెడ్డి, గిడుగు రుద్రరాజు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ గ్యారెంటీలకు సంబంధించిన పోస్టర్​ను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్​ 9 గ్యారంటీలను ఇంటింటికి తీసుకెళ్లాలని సూచించారు.

ఏపీలో కాంగ్రెస్ పార్టీ 9 గ్యారెంటీలు ఇవే…

1. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే 10 ఏళ్లు ప్రత్యేక హోదాపై సంతకం
2. రైతులకు 2 లక్షల వరకూ రుణమాఫీ
3. ప్రతి పేద మహిళకు నెలకు 8500 రూపాయలు, ఏడాది లక్ష రూపాయలు
4. రైతాంగానికి పెట్టుబడిపై 50 శాత లాభంతో కొత్త మద్దతు ధర
5. ఉపాధి హామీ కింద కూలీలలకు కనీస వేతనం 400 రూపాయలు
6. కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య
7. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ
8. ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి మహిళ పేరుపై 5 లక్షలతో పక్కా ఇళ్లు
9. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ పెన్షన్, వృద్ధులకు 4 వేలు, వికలాంగులకు 6 వేల పెన్షన్

జగన్ అమ్మఒడి అని ఇద్దరు బిడ్డలకు ఇస్తామని మోసం చేశారని, అధికారంలోకి వచ్చాక ఒక్కరికీ అది కూడా తగ్గించి ఇచ్చారన్నారు. జగన్ ప్రభుత్వంలో ధరలు కరెంటు ఛార్జీలు ఏడు సార్లు దారుణంగా పెంచారన్నారు. యువతకు 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేలా మరో గ్యారెంటీని కాంగ్రెస్ పార్టీ ఇస్తోందన్నారు. రాష్ట్రంలోనే 2.25 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం అదేనని తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లనిర్మాణానికి గ్యారెంటీ ఇస్తుందన్నారు. పెన్షన్​ను అర్హులైన వృద్ధులకు అందరికీ 4 వేల రూపాయలు ఇచ్చేలా మరో గ్యారంటీని కాంగ్రెస్ హామీ ఇస్తోందని షర్మిల రెడ్డి తెలిపారు.