ఈసీ నిర్ణయాన్ని ఆమోదించి, కొత్త గుర్తు తీసుకోవాలిః శరద్ పవార్ కీలక సూచన

ప్రజలు కొత్త గుర్తును ఆమోదిస్తారన్న అభిప్రాయం

Sharad Pawar’s Advice To Uddhav Thackeray After He Loses Shiv Sena Symbol

న్యూఢిల్లీః శివసేన పార్టీ, గుర్తుల విషయంలో ఉద్ధవ్ థాకరేకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక సూచన చేశారు. శివసేన పార్టీ పేరుతోపాటు, పార్టీ గుర్తుగా ఉన్న విల్లు, బాణంను శివసేన నుంచి వేరు పడిన ఏక్ నాథ్ షిండే వర్గానికి ఎన్నికల సంఘం కేటాయిస్తూ నిర్ణయం ప్రకటించడం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో పోరాడతానని శివసేనాని ఉద్ధవ్ థాకరే ప్రకటించగా.. ఈ విషయంలో రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక సూచన చేశారు.

ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఆమోదించి, కొత్త పార్టీ గుర్తు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్ణయం పెద్దగా ప్రభావం చూపించదని, ప్రజలు కొత్త గుర్తును ఆమోదిస్తారని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. ‘‘ఇది ఎన్నికల సంఘం నిర్ణయం. ఒక్కసారి నిర్ణయం ప్రకటించిన తర్వాత ఇక దానిపై చర్చ అనవసరం. ఆమోదించి కొత్త గుర్తు తీసుకోవడమే’’ అని పవార్ పేర్కొన్నారు.

‘‘ఇందిరాగాంధీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. కాంగ్రెస్ కు గతంలో కాడితో కూడిన రెండు ఎద్దుల గుర్తు ఉండేది. తర్వాత దాన్ని కోల్పోవడంతో హస్తం గుర్తు లభించింది. దాన్ని ప్రజలు ఆమోదించారు. అలాగే, ప్రజలు ఉద్ధవ్ థాకరే పార్టీకి సంబంధించి కొత్త గుర్తును స్వీకరిస్తారు’’ అని పవార్ పేర్కొన్నారు.