శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమ బంగారం పట్టివేత

Gold ETF
Gold

హైదరాబాద్ః హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో మరోసారి అక్రమ బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వద్ద 823 గ్రాముల బంగారం పట్టుబడింది. దాని విలువ రూ.47 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారాన్ని పేస్టుగా మార్చి, ప్లాస్టిక్‌ కవర్‌లో ప్యాక్‌ చేశాడని, దానిని లోదుస్తుల్లో దాచి తరలించే యత్నం చేశాడని చెప్పారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వెల్లడించారు.

రెండు రోజుల క్రితం ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. సూడాన్‌ జాతీయులైన 23 మంది మహిళలు సూడాన్‌ నుంచి షార్జా మీదుగా గురువారం తెల్లవారుజామున శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చారు. వారి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్‌ అధికారులు వారిని తనిఖీ చేశారు. దీంతో 14 కేజీల 906 గ్రాముల బంగారం లభించింది. దీనివిలువ రూ.7.89 కోట్లు ఉంటుందని నిర్ధారించారు. బూట్ల అడుగున ప్రత్యేకంగా తయారు చేసిన భాగంలో ఆభరణాలను ఉంచి తరలిస్తున్నారని అధికారులు తెలిపారు.