హైదరాబాద్లో ప్రారంభానికి సిద్దమైన మరో అతి పొడవైన ఫ్లైఓవర్…

హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..నగరంలో అతి పొడవైన ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ డివిజన్‌ పరిధిలోని షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌ పనులన్నీ పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధమైంది. రేతిబౌలి నుండి గచ్చిబౌలి వరకు ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు 6 లేన్ల గల రెండు ఫ్లైఓవర్లు వయా షేక్ పేట్ ఫిలింనగర్ జంక్షన్ ఓయు కాలనీ జంక్షన్, విస్పర్ వ్యాలీ జంక్షన్ వరకు నిర్మించిన షేక్ పేట్ ఫ్లైఓవర్ ఇంటర్మిడియట్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి అయ్యింది. హైటెక్ సిటీ వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రజలకు ఈ మధ్యంతర రింగ్ రోడ్ నిర్మాణం వలన ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతాయి. రూ. 333.55 కోట్ల అంచనా వ్యయంతో 2.8 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయ్యింది.

ఫ్లైఓర్ నిర్మాణం వలన హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి వెళ్లేందుకు ఆ ప్రాంత ప్రజలకు సులభతరం అవుతుంది. రూ.333.55 కోట్లతో 2018లో ఈ వంతెన మార్గం పనులను ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న ఈ ఫ్లైఓవర్‌ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు ఎక్కడా సిగ్నల్స్‌ లేకుండా గమ్యస్థానాలకు చేరేలా ఈ ఫ్లైఓవర్‌ ఎంతో ఉపయోగపడనుంది. ఈ నెలాఖరుకు రెండు ఫ్లైఓవర్‌లను ప్రారంభిస్తామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్‌ విజయలక్ష్మి తెలిపారు. షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌ను గురువారం ఆమె పరిశీలించి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.