జర్మనీలో కాల్పుల కలకలం..

జర్మనీలో కాల్పుల కలకలం రేగింది. హాంబర్గ్ నగరంలోని జెహోవాస్ విట్నెస్ సెంటర్ అనే చర్చ్‌లో జరిగిన కాల్పుల్లో ఏకంగా ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన గురువారం రాత్రి 09.15 గంటల ప్రాంతంలో జరిగింది. భారీగా జనం గుమిగూడి ఉన్న సమయంలో గన్ చేతబట్టిన వ్యక్తి ఉన్నట్లుండి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు మరణించినట్లు సమాచారం. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.

ఘటన సమాచారం అందుకున్న భద్రతా దళాలు బిల్డింగ్‌ను చుట్టుముట్టాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు మరణించినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో గాయపడ్డవారిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి చేర్చి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాద స్థలంలో ఉన్న మిగతావారిని పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

ఇక స్థానిక పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు. తీవ్ర ప్రమాదం పొంచి ఉన్నందున స్థానికులు తమ ఇళ్లల్లోంచి బయటకు రావద్దని సూచించారు. ఇక కాల్పులు జరిగిన సమయంలో జెహోవా విట్నెస్‌ వర్గానికి చెందిన సభ్యులు బైబిల్ అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది. ఇటీవల కాలంలో జర్మనీలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అటు జీహాదీలు.. ఇటు ఫార్ రైట్ అతివాదుల దాడుల్లో పలువురు అమాయకులు అసువులు బాసారు.