మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్..

టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడ్ని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అయ్యన్నపాత్రుడి తో పాటు ఆయన కుమారుడు రాజేష్ ను సైతం అదుపులోకి తీసుకున్నారు. గురువారం తెల్లవారుజామున అయ్యన్నపాత్రుడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. పోలీసులు అర్థరాత్రి ఇంట్లోకి ప్రవేశించి వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీడియోలు తీస్తున్న మీడియా ఫోన్లను లాక్కున్నారు. ఇంటిగోడ కూల్చివేత వ్యవహారంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగం ఉంది. దీంతో సీఐడీ పోలీసులు అయ్యన్నపాత్రుడుని అరెస్ట్ చేసి..అతనితో పాటు అతని కుమారుడు చింతకాయల రాజేష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొదటి నిందితుడిగా అయ్యన్నపాత్రుడు ఉండగా.. రెండో నిందితుడిగా విజయ్, మూడో నిందితుడిగా రాజేష్ ఉన్నారు. ఏలూరు కోర్టులో వారిని ప్రవేశపెడుతామని చెప్పి తీసుకెళ్లారు పోలీసులు. కానీ ఆయన్ను విశాఖ ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి తరలించారు. విచారణ అనంతరం ఏలూరు తీసుకెళ్తారా? లేక విశాఖలోనే కోర్టులో ప్రవేశపెడతారో వెల్లడించలేదు పోలీసులు.

అయ్యన్నపాత్రుడి అరెస్టుపై ఆయన సతీమణి అగాథం వ్యక్తం చేసారు. అర్ధరాత్రి దౌర్జన్యంగా అరెస్టు చేయడమేంటని నిలదీస్తున్నారు. తాము ఎవరికేం అన్యాయం చేశామని ఇలా చేశారో అర్థంకావడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం దుస్తులు మార్చుకొనివ్వకుండా తన భర్తను తోసుకుంటూ తీసుకువెళ్లారని చెప్పారు. కాళ్లకు చెప్పులు కూడా వేసుకొనివ్వలేదని.. 3 ఏళ్లుగా తమ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె వాపోయారు. కొంతమంది పోలీసులు మద్యం సేవించి వచ్చారని.. అయ్యన్నకు ప్రాణ హాని ఉందని ఆరోపించారు. ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.