స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పాకిస్థానీ సీమా హైదర్

పబ్జీ ఆటలో పరిచయమైన సచిన్ కోసం బార్డర్ దాటి వచ్చిన పాకిస్థానీ మహిళ

Seema Haider Celebrates Har Ghar Tiranga, Hoists Tricolour Ahead Of Independence Day 2023

న్యూఢిల్లీః పబ్జీ ఆటలో పరిచయమైన యువకుడిని ప్రేమించి, అతడితో కలిసి ఉండేందుకు సరిహద్దులు దాటి వచ్చిన పాకిస్థానీ మహిళ సీమా హైదర్ తాజాగా భారత స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ పతాకం రంగు చీర ధరించి, చేతిలో పతాకంతో భరతమాతకు జేజేలు పలికారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నోయిడాలోని తన ప్రియుడి ఇంట్లో పిల్లలు, లాయర్ తో కలిసి వేడుకలు జరుపుకున్నారు. ఇంటిపైన జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రియుడు సచిన్ ను పెళ్లాడి తాను భారతీయురాలిగా మారిపోయానని సీమా హైదర్ అంటున్నారు. భరతమాత తనకు కూడా తల్లేనని, తాను పాకిస్థాన్ కు వెళ్లబోనని స్పష్టం చేశారు. తనకు భారత పౌరసత్వం జారీ చేయాలంటూ సీమా హైదర్ ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా, సీమా హైదర్ ప్రేమ ప్రయాణం ఆధారంగా పలు హిందీ సినిమాలు రూపుదిద్దుకోనున్నాయి.

‘కరాచీ టు నోయిడా’ పేరుతో ఓ సినిమా నిర్మించనున్నట్లు నోయిడాకు చెందిన నిర్మాత అమిత్ జానీ ప్రకటించారు. ఇందులో హీరోయిన్ గా నటించాలని సీమా హైదర్ కు ఆఫర్ ఇవ్వగా.. సీమా తిరస్కరించినట్లు సమాచారం. మరోవైపు, సీమాతో సినిమాలు నిర్మించే ప్రయత్నం చేయొద్దంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్ఎన్ఎస్) హెచ్చరికలు జారీ చేసింది.