సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసు : మరో రిమాండ్ రిపోర్టును విడుదల చేసిన పోలీసులు

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ ఫై దాడి కేసులో పోలీసులు మరో రిమాండ్ రిపోర్ట్ ను విడుదల చేసారు. ఈ కేసులో ఇప్పటికే 56మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈరోజు మరో 10మందిని అదుపులోకి తీసుకున్నారు. ఏ-2 పృథ్వీరాజ్​తో పాటు.. మరో 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. వాళ్లందరిని అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. వారిని నిందితులుగా చేర్చారు. ఆ తర్వాత వాళ్లను సికింద్రాబాద్ రైల్వే కోర్టులో హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన తర్వాత పోలీసులు చంచల్​గూడ జైలుకి తరలించారు. నిందితులను కోర్టుకి తరలిస్తుండగా వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తమ బిడ్డలు అమాయకులని, ఎవరో రెచ్చగొడితే ఇదంతా చేశారని వారు కన్నీటిపర్యంతం అయ్యారు. ఇక ఈ కేసులో బోగీలకు నిప్పు పెట్టి, బోగీల అద్దాలను ధ్వంసం చేసిన పృథ్వీరాజ్ ను పోలీసులు ఏ12 నుంచి ఏ2గా మార్చారు. ఇందులో కొందరు వాట్సప్ అడ్మిన్ గ్రూప్ అడ్మిన్ లుగా ఉన్నట్లు పోలీసులు తేల్చారు.

ఇక ఈ విధ్వంసం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును పోలీసులు విచారిస్తున్నారు. అతడిని నరసరావుపేటను హైదరాబాద్ కు తరలించిన పోలీసులు ఘటనపై అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఇక రెండో రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ప్రస్తావించారు పోలీసులు. ‘‘సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులైన సుబ్బారావు, శివలు నిరసనకారులకు సహకరించారు. సుబ్బారావు, శివలు దాడులు చేయాలని చెప్పినట్లు విద్యార్థులు చెప్పుకున్నారు. హకీంపేట్ సోల్జర్స్ వాట్సప్ గ్రూప్ లో ఫోటోలను సుబ్బారావు, శివలు షేర్ చేశారు. అల్లర్లకు కావాల్సిన పెట్రోల్, కర్రలులు, రాడ్లు సమకూర్చారు. అంతేకాకుండా అభ్యర్థులు స్టేషన్ వరకు చేరేందుకు రవాణా సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు’’ అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.