సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాదం ఘటన లో కీలక విషయాలు బయటపడుతున్నాయి

సికింద్రాబాద్ లోని రామ్‌గోపాల్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నల్లగుట్ట వద్ద గల డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ షో రూమ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగి దాదాపు 8 గంటలు కావొస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి రాలేదు. మంటలను అదుపు చేసేందుకు అగ్ని మాపక సిబ్బంది దాదాపు 27 ఫైర్ ఇంజన్ల తో శ్రమిస్తున్నారు. పొరుగున ఉన్న నాలుగు భవనాల్లోకి మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల ఇళ్లలోని వారందరినీ ఖాళీ చేయించారు. ఏళ్లుగా ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న కొంత మంది సామన్లు చేతబట్టుకొని కన్నీరు పెట్టుకుంటూ, గుండెలు బాదుకుంటూ అక్కడి నుంచి తరలిపోయారు. తమ ఇళ్లపై ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా ఎలాంటి భవనం అయినా.. 4 గంటల పాటు మాత్రమే మంటలను తట్టుకునే శక్తి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలాంటిది 6 గంటలు అవుతున్నా.. మంటలు అదుపులోకి రాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. భవనం ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

ఈ అగ్నిప్రమాదం కారణంగా సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల వరకు పొగ వ్యాపించింది. సమీప ప్రాంతాల ప్రజలు పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అలాగే మంటల్లో చిక్కుకున్న కొంత మందిని అధికారులు కాపాడారు. సహాయక చర్యల్లో భాగంగా ఓ భవనం గోడను కొంత భాగం కూల్చివేయడంతో ఒక్కసారిగా తీవ్రమైన పొగ కమ్ముకుంది. అగ్నిమాపక సిబ్బంది సైతం అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరు సిబ్బందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్లాత్, రెగ్జిన్, ప్లాస్టిక్ లాంటి పదార్థాల కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే అగ్నిప్రమాదం జరిగిన భవనానికి సంబంధించి 4, 5 అంతస్తులకు అనుమతి లేదని జీహెచ్ఎంసీ అధికారులు ధృవీకరించారు. రేపు బిల్డింగ్ను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించనున్నారు. బిల్డింగ్ యజమానిపై క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉంది. ఐదు అంతస్థుల బిల్డింగ్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు శూన్యమని తెలుస్తోంది. కార్ డెకర్స్, స్పోర్ట్స్ స్టోర్ లకు మాత్రమే ట్రేడ్ లైసెన్స్ ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. గోడౌన్కు ఎటువంటి పర్మిషన్ లేదని స్పష్టం చేశారు.