స్థానిక ఎన్నికల వాయిదాపై స్పందించిన ఎన్నికల కమిషనర్‌

షెడ్యూల్ ప్రకారం ఎన్నికలను నిర్వహించలేము

AP State Election Commissioner Ramesh Kumar
AP State Election Commissioner Ramesh Kumar

విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయంపై స్పందించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలను నిర్వహించవచ్చని ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. ఈ లేఖకు రమేశ్ సమాధానం ఇచ్చారు. నీలం సాహ్ని రాసిన లేఖకు ఎస్ఈసీ రమేశ్ మూడు పేజీల పూర్తి స్థాయి వివరణతో లేఖ రాశారు. షెడ్యూల్ ప్రకారం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే పరిస్థితి లేదని లేఖలో ఆయన స్పష్టం చేశారు. కరోనా వైరస్ ప్రభావం వల్లే ఎన్నికలను వాయిదా వేశామని తెలిపారు. దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని… ఇప్పటికే పశ్చిమబెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేశారని పేర్కొన్నారు. అదే విధంగా ఏపీలో కూడా వాయిదా వేశామని చెప్పారు.

ఎన్నికలు జరగకపోతే 14వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి రావనే ఆరోపణలకు కూడా రమేశ్ వివరణ ఇచ్చారు. ఆర్థికశాఖలో పని చేసిన అనుభవం తనకు ఉందని… ఎన్నికలు ఆలస్యమైనా, ఎన్నికల ప్రక్రియ పూర్తైన తర్వాత కూడా నిధులను తెచ్చుకున్న సంఘటనలు చాలా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రానికి నిధులను తెచ్చుకోవడానికి ఎలాంటి ఆటంకం ఉండదని తెలిపారు. ఎన్నికల వాయిదాకు ఎస్ఈసీ కట్టుబడి ఉందని… తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశమే లేదని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ఉందని… ఇక్కడ ఎన్నికలను నిర్వహిస్తే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను, కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను పాటిస్తున్నామని తెలిపారు. మరోవైపు, ఎన్నికలను ఎప్పుడు నిర్వహించబోతున్నారనే విషయాన్ని మాత్రం లేఖలో ఆయన పేర్కొనలేదు.

తాజా ఆధ్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/