ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఇంట విషాదం

ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఇంట విషాదం నెలకొంది. శ్రీవాణి మామ, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు మృతి చెందారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్య తో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. చంద్రశేఖర్ రాజు భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు కురుపాం మండలంలోని చినమేరంగి కోటకు తరలించనున్నారు. చంద్రశేఖర్ రాజు టీడీపీ నేత శత్రుచర్ల విజయరామరాజుకు సోదరుడు. అంతేకాదు ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణికి ఆయన మామ అవుతారు. చంద్రశేఖర్ రాజు మృతిపట్ల నేతలు, కార్యకర్తలు సంతాపం ప్రకటిస్తున్నారు.

చంద్రశేఖర్ రాజు 1989లో కురుపాం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఆయన మేనల్లుడు వీటీ జనార్దన్‌ థాట్రాజ్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన వైఎస్సార్‌సీపీలో చేరగా.. 2014లో ఆయన కోడలు పాముల పుష్పశ్రీవాణి వైఎస్సార్‌సీపీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చంద్రశేఖరరాజు 2018లో వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు.. 2019 ఎన్నికల సమయంలో తిరిగి సొంతగూటికి వచ్చారు. 2019లో పుష్ప శ్రీవాణి మళ్లీ గెలుపొందగా జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా పదవి దక్కింది.