చిత్రసీమలో మరో విషాదం..సల్మాన్ ఖాన్ డూప్ మృతి

చిత్రసీమలో వరుస విషాదాలు ఆగడం లేదు. ప్రతి రోజు ఏదొక ఇండస్ట్రీ లో చిత్రసీమ కు చెందిన ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు. ఈ మధ్యనే తెలుగు చిత్రసీమ లో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. కృష్ణం రాజు , కృష్ణ భార్య ఇందిరాదేవి మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు బాలీవుడ్ చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ డూప్ సాగర్ పాండే గుండెపోటుతో మరణించారు. ముంబైలో జిమ్ చేస్తుండగా ఆయనకు గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ విచారం వ్యక్తం చేశారు. సాగర్ పాండే ఆత్మకు శాంతి కలగాలని కోరారు.

ప్రస్తుతం సాగర్ పాండే వయస్సు సుమారు 50 సంవత్సరాలు. సల్మాన్ ఖాన్‌తో కలిసి 50కి పైగా చిత్రాలలో కనిపించారు సాగర్ పాండే. ‘బజరంగీ భాయిజాన్’, ‘ట్యూబ్‌లైట్’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’, ‘దబాంగ్’, ‘దబాంగ్ 2’, ‘బిగ్ బాస్’ వంటి టీవీ షోలలో సల్మాన్ ఖాన్ కోసం సాగర్ పాండే డూప్ గా పని చేశారు. దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా స్టేజ్ షోలు చేసి పలువురి మెప్పు పొందారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో సాగర్ పాండే జనించారు. ఆయన అంత్యక్రియలు ప్రతాప్‌గఢ్‌లో జరుగనున్నాయి. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడిన సాగర్ పాండే.. సల్మాన్ ఖాన్ సాయం పొందారు. సాగర్ పాండే మరణ వార్త తెలిసి సోషల్ మీడియా వేదికగా పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.