దుమ్ములేపిన సాయి పల్లవి.. సారంగ దరియాతో సెంచరీ!

టాలీవుడ్‌లో ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించే చిత్రాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన తెరకెక్కించే చిత్రాలు ఖచ్చితంగా క్లాస్ ఆడియెన్స్‌ను మెప్పించే విధంగా ఉంటాయని ప్రేక్షకులు అంటారు. కాగా ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరి’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది.

ఇక ఈ సినిమాలోని ‘సారంగ దరియా’ అనే పాటను చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేశారు. కాగా ఈ పాటను ఫోక్ సింగర్ మంగ్లీ పాడగా, సాయి పల్లవి అదిరిపోయే స్టెప్పులతో ఈ పాటకు ఎక్కడలేని రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తూ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. ఎవ్వరిని చూసినా ఈ పాటకు స్టెప్పులేస్తూ వీడియోలు తీసి హంగామా చేస్తూ ఉన్నారు. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

సారంగ దరియా పాట ఏకంగా 100 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుని అదిరిపోయే రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఈ పాటను సుద్దాల అశోక్ తేజ కోమలి అనే తెలంగాణ ఫోక్ సింగర్ దగ్గర్నుండి సేకరించి కొన్ని మార్పులు చేశారు. ఈ సినిమాకు పవన్ సంగీతం అందించగా, వేసవి కానుకగా ఈ సినిమాను ఏప్రిల్ 16న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి సారంగ దరియా మున్ముందు ఇంకా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.