గుండెనొప్పి తో హాస్పటల్ లో చేరిన సాయిచంద్ భార్య ..

ప్రముఖ గాయకుడు , రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సాయిచంద్ ఇటీవల గుండెనొప్పి తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. సాయిచంద్ మరణం యావత్ తెలంగాణను శోకసంద్రంలో పడేసింది. తెలంగాణ ఉద్యమ సమయం నుండి కేసీఆర్ వెంట ఉంటూ..పార్టీ లో చురుగ్గా పాల్గొంటూ అందరి మన్నలను పొందిన సాయి..హఠాన్మరణం అందర్నీ కన్నీరు పెట్టించింది. సాయిచంద్‌ మరణాన్ని తట్టుకోలేక రోదిస్తున్న ఆయన భార్య రజిని సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం సాయంత్రం గుండెనొప్పి రావడంతో వెంటనే ఆమెను గుర్రంగూడలోని ఓ ప్రైవేట్‌ హాస్పటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమెకు డాక్టర్స్ వైద్యం అందిస్తున్నారు.

సాయిచంద్ 1984, సెప్టెంబరు 20న తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, అమరచింత గ్రామంలో వెంకటరాములు, మణెమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన అమరచింతలో పదో తరగతి, ఆత్మకూరులో ఇంటర్, హైదరాబాద్‌లో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాడు. సాయిచంద్ కు ఉస్మానియా యూనివర్సిటీలో పరిచయమైన రజనీని 2012లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు చరీష్ (చెర్రీస్), కుమార్తె నది ఉన్నారు.

అభ్యుదయ భావాలు కలిగిన తన తండ్రి లాగే ప్రజా సమస్యలపై పాటలు రాస్తూ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ప్రజలను తన పాటలతో చైతన్యం చేసేవాడు.ముఖ్యంగా. తెలంగాణా ఉద్యమకారుల బలిదానాల పై వ్రాసిన పాటలను ఆలపిస్తూ… ప్రజలను ఉత్తేజితులను చేశాడు. మలిదశ తెలంగాణోద్యమంలో ఎన్నో ధూంధాం కార్యక్రమాలతో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలించాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ ప్రభుత్వ పథకాలను తన ఆట పాటలతో ప్రజలోకి తీసుకువెళ్ళాడు. 2009 నుండి 2023 వరకు అసెంబ్లీకి జరిగిన సాధారణ, ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున తన ఆట పాటలతో ప్రచారంలో పాల్గొని పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించాడు. 2021 డిసెంబరు 15న తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ సంస్థ చైర్మన్‌గా నియమితుడై , 2021, డిసెంబరు 24న కార్పొరేషన్ చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.

2023, జూన్ 28న సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం, కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లగా అర్ధరాత్రి వేళ ఆయనకు గుండెపోటు రాగా నాగర్ కర్నూల్ లోని గాయత్రి ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఆయన పరిస్థితి విషమించడంతో హైదరబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 2023, జూన్ 29న తెల్లవారుజామున 3 గంటల సమయంలో మరణించాడు.