సిర్పూర్ నియోజకవర్గం నుంచి RS ప్రవీణ్ పోటీ

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సిర్పూర్ ప్రజలు చాలామంది తనను కోరారని, మాయవతితో చర్చించిన తర్వాత ఆమె ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లోని సిర్పూర్ ప్రాంతాన్ని ఆంధ్ర పాలకుల దోపిడీ నుండి విముక్తి కల్పించి తెలంగాణలో కలుపుతామన్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దోపిడీ, దందాలు ఆగాలంటే ప్రతి ఒక్కరూ బీఎస్పీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తనను గెలిపిస్తే ఆంధ్ర పెత్తందారుల పాలన నుంచి విముక్తి చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే కొనప్ప భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారని, భూకబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయనను ఓడించి ఇంటికి పంపించాలనే ఉద్దేశంతోనే ప్రజల కోరిక మేరకు సిర్పూర్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు స్పష్టతిచ్చారు. రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తే మాలీలను ఎస్టీలో చేర్చుతామని హామీ ఇచ్చారు. తెలంగాణలో అవినీతి పాలన కొనసాగుతుందని ఆరోపించిన ఆయన.. కేసీఆర్ పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు.

పోడు భూముల పట్టాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది ఆదివాసీలు దరఖాస్తులు చేస్తే కేవలం 1.5 లక్షల మందికి మాత్రమే ప్రభుత్వం పట్టాలిచ్చిందని అన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఏజెన్సీ ఏరియాలో నివసించే బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ ప్రజలందరికీ పొడు పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఆదివాసి బిడ్డలు అత్యంత దుర్భరజీవితాలు గడుపుతున్నారన్న ఆయన దళిత బంధు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు.