ఎమ్మెల్యె స్టిక్కర్‌తో కారు ..రూ.5.27కోట్లు స్వాధీనం

ఒంగోలుకు చెందిన ముగ్గురి అరెస్ట్

Rs 5 Cr Seized From A Car In Chennai

ఒంగోలు: ఏపి నుండి చెన్నైకి కొందరు వ్యక్తులు గంజాయిని పెద్దమొత్తంలో రవాణా చేస్తున్నట్టు ఆరంబాక్కం తమిళనాడు పోలీసులకు సమాచారం అందింది. దీంతో తమిళనాడులోని గుమ్మడిపూండి సమీపంలోని ఎలావూరు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే స్టిక్కర్‌తో వచ్చిన కారును ఆపి తనిఖీ చేసిన పోలీసులు వెనక సీట్‌లో ఉన్న నాలుగు సంచులను గుర్తించి బయటకు తీశారు. వాటిని తెరిచి చూడగా పెద్ద మొత్తంలో డబ్బు కనిపించింది. కారులో భారీ మొత్తంలో డబ్బును తరలిస్తూ ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. మొత్తం 5.27 కోట్లు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు దానికి సంబంధించి ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో ఆ సొమ్మును స్వాధీనం చేసుకుని ఆదాయ పన్ను శాఖకు అప్పగించారు. అలాగే, కారులో ఉన్న ఒంగోలుకు చెందిన నాగరాజ్, వసంత్, కారు డ్రైవర్ సత్యనారాయణను అరెస్ట్ చేశారు. కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. కోయంబత్తూరు సెంట్రల్ ఆర్టీవీ పరిధిలోని వి.రామచంద్రన్ అనే వ్యక్తి పేరిట కారు రిజిస్టర్ అయినట్టు పోలీసులు తెలిపారు. కాగా పట్టుబడ్డ నగదుతోపాటు కారును,నగదును చెన్నై ఐటీ కార్యాలయానికి తరలించారు. ఈ సంఘటనపై ఐటీ అధికారులు లోతుగా విచారణ చేపట్టారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/