సీఎం రేవంత్ ను కలిసిన రోహిత్ వేముల తల్లి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోహిత్ వేముల ఆత్మహత్య కేసును కోర్ట్ క్లోజ్ చేయడం పట్ల యావత్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్ తల్లి ఈరోజు శనివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడేందుకు కారణమైన వారికి చట్టపరంగా శిక్ష పడేలా చూడాలని అభ్యర్థించారు. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఓ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా రోహిత్ వేముల కేసు విషయంలో పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

శుక్రవారం రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు విచారణను ముగిస్తున్నట్లు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని, అతని ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, అదేవిధంగా రోహిత్ వేముల ఎస్సీ సామాజికవర్గానికి చెందిన యువకుడు కాదంటూ పోలీసులు కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పేర్కొన్నారు. దీనిపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీ యూ) విద్యార్థులతో పాటు వివిధ సంఘాలు, రోహిత్ వేముల తల్లి రాధిక వేముల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం యూనివర్సిటీలో ఆందోళన నిర్వహించారు. రోహిత్ వేముల కుటుంబ సభ్యులు, పలువురు నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రోహిత్ వేముల ఆత్మహత్య కేసును రీఓపెన్ చేసి విచారించనున్నట్లు పోలీసులు తెలిపిన విషయం విధితమే. ఇందుకు సంబంధించి కోర్టు అనుమతి కోరనున్నట్లు కూడా పోలీసులు తెలిపారు.