బండి సంజయ్ తో కలిసి పాదయాత్ర చేసిన వివేక్ వెంకటస్వామి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చౌటుప్పల్ మండలంలో సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈరోజు సంజయ్ పాదయాత్రలో జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి జాయిన్ అయ్యారు. అంకిరెడ్డి గూడంలో బండి సంజయ్ తో కలిసి పాదయాత్ర చేసారు. వివేక్తో పాటు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా జత కలిశారు.

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్ర రూట్ మ్యాప్ లో మార్పులు చేర్పుల అంశం భేటీలో ప్రస్తావనకు వచ్చింది. రాజగోపాల్ రెడ్డి సూచనలపై నేతలు చర్చించారు. మరోవైపు ఈనెల 21న నిర్వహించనున్న అమిత్ షా సభ ఏర్పాట్ల గురించి బండి సంజయ్తో పాటు వివేక్ వెంకటస్వామి సమీక్షించారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడుకున్నారు. ఇక రాష్టంలో ఎమ్మెల్యేగా ఉండి కూడా మునుగోడు నియోజకవర్గానికి నిధులు తీసుకురాలేకపోయానని, తన రాజీనామాతోనైనా మునుగోడు అభివృద్ధి జరుగుతుందని రాజగోపాల్ అభిప్రాయపడ్డారు.

కోట్ల రూపాయల సొంత నిధులను ఖర్చు చేసి, ప్రజల కనీస అవసరాలను తీర్చానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను నిజాయితీగా పని చేస్తున్నందున మునుగోడు నియోజకవర్గం ప్రజలు తన వెంటే ఉన్నారని అన్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనపై చేసిన కామెంట్స్ పై కూడా స్పందించారు. తనపై విమర్శలు, ఆరోపణలు చేసే ముందు గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్ని పార్టీలు మారాడో గుర్తుకు తెచ్చుకోవాలని సెటైర్ వేశారు. పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేయకుండానే గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకున్న విషయం ప్రజలందరికీ తెలుసని చెప్పారు.