వర్మ కు కొడాలి నాని ఎవరో తెలియదట..

మొన్నటివరకు వైసీపీ సర్కార్ కు కాస్త సపోర్ట్ గా ఉన్న డైరెక్టర్ వర్మ..ఇప్పుడు సినిమా టికెట్ ధరల విషయంలో వైసీపీ సర్కార్ చేస్తున్న తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ …సర్కార్ ఫై నిప్పులు చెరుగుతున్నారు. గత నాల్గు రోజులుగా వర్మ..టికెట్స్ ధరల విషయంలో వరుస ట్వీట్స్ , పలు చానెల్స్ లలో డిబేట్ లు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తన ట్విట్టర్ లో కొడాలి నాని ఎవరో నాకు తెలియదు..నాకు తెలిసింది ఒక్క నేచురల్ స్టార్ నాని మాత్రమే అని ట్వీట్ చేసి హాట్ టాపిక్ అయ్యాడు.

రీసెంట్ గా వర్మ చేసిన కామెంట్స్ ఫై కొడాలి నాని స్పందిస్తూ.. ‘రాష్ట్రంలో ప్రస్తుతం మా పార్టీ అధికారంలో ఉంది. ప్రజలే మాకు ఈ అధికారాన్ని అప్పగించారు. పక్క రాష్ట్రంలో కూర్చొని అక్కడ సినిమాలు తీసుకుంటున్న వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలకే మేము జవాబుదారీతనంగా ఉంటాం. రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. సినిమా టికెట్ ధరల్లో ప్రభుత్వానికి సంబంధం లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి వాళ్లనే అమ్ముకోమని చెప్పండి. చూద్దాం” అని అన్నారు.

దీనికి కౌంటర్ గా వర్మ.. ”ఏపీ టికెట్ రేట్ల విషయంలో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంభందించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని నేచురల్ స్టార్ నాని ఒక్కడే.. వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు” అని వ్యగ్యంగా ట్వీట్ చేసాడు. ఈ మధ్య నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ మూవీ ప్రమోషన్లలో నాని ఏపీలో టికెట్ ధరలపై పలు వ్యాఖ్యలు చేయగా.. దానిపై స్పందించిన ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందిస్తూ.. ”నాకు తెలుగు రాష్ట్రాల్లో కొడాలి నాని ఒక్కరే తెలుసు. ఈ నాని ఎవరో నాకు తెలియదు” అని అన్నారు. ఇప్పుడు అదే తరహాలో వర్మ తనకు కొడాలి నాని ఎవరో తెలియదని.. హీరో నాని మాత్రమే తెలుసని జవాబు ఇచ్చాడు. మొత్తం మీద ఏపీలో సినిమా టికెట్ ధరల విషయంలో వర్మ కాస్త గట్టిగానే ఇండస్ట్రీ తరుపున మాట్లాడుతున్నాడు.