అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డిలో పోటీకి సిద్ధమేః రేవంత్‌రెడ్డి

tpcc-chief-revanth-reddy

హైదరాబాద్‌ః అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డిలో పోటీకి సిద్ధమని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. తానైనా లేదా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అయినా పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధమని చెప్పారు. సిఎం కెసిఆర్‌, ఆయన తనయుడు, మంత్రి కెటిఆర్‌ను చిత్తుగా ఓడించేందుకు రెడీగా ఉన్నామని తెలిపారు. కొడంగల్‌లో పోటీ చేయాలని కెసిఆర్‌ను ఆహ్వానించానని.. కానీ.. కొడంగల్‌లో పోటీకి కెసిఆర్‌ రాకపోతే కామారెడ్డిలో పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు.

“ఉమ్మడి ఏపీలో ప్రజలు ఎప్పుడూ హంగ్‌కు అవకాశం ఇవ్వలేదు. తెలంగాణలోనూ హంగ్‌ ఎప్పుడూ రాలేదు. ఈ ఎన్నికల్లో మూడింట రెండో వంతు మెజారిటీతో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది. రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌, విశ్వేశ్వర్‌రెడ్డి, విజయశాంతి, డీకే అరుణ, జితేందర్‌రెడ్డి బిజెపిలో చేరారు. అయితే బిజెపి, బిఆర్ఎస్ నేతలు దోచుకున్నది పంచుకుంటున్నారని గ్రహించారు. దోపిడీదారులతో ఇమడలేమని.. ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ అని గుర్తించారు. రాష్ట్రంలో అవినీతిని నిలువరించేందుకు బిజెపిలో చేరామన్నారు. బిజెపి సిద్ధాంతాలను ఆకర్షితులై ఆ పార్టీలో చేరలేదు. బిఆర్ఎస్ అవినీతిలో బిజెపి నేతలు భాగస్వాములని గ్రహించి వెనక్కి వస్తున్నారు. కాంగ్రెస్‌లో తిరిగి చేరే నేతలను సాదరంగా ఆహ్వానించి తగిన హోదా ఇస్తాం.” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.