తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి..

తెలంగాణ కొత్త సీఎం గా రేవంత్ రెడ్డి ని ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 64 స్థానాల్లో విజయం సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఇదే క్రమంలో సీఎం పదవి రేస్ లో పలువురు సీనియర్లు పోటీ పడడంతో అధిష్టానం గత రెండు రోజులుగా చర్చలు జరుపుతూ వచ్చింది.

మంగళవారం ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే (Mallikarjun Kharge) నివాసంలో కాంగ్రెస్‌ కీలక నేతలు సమావేశమయ్యారు. సీఎం పదవి కోసం పోటీ పడుతున్న ఉత్తమ్ (Uttam) , భట్టి (Bhatti) లతో విడివిడిగా చర్చలు జరిపారు. ఈ సమావేశానికి పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ, జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించిన డీకే శివకుమార్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మానిక్‌రావు థాక్రే పాల్గొన్నారు. సీనియర్ల తో మాట్లాడిన అధిష్టానం ఫైనల్ గా రేవంత్ ను సీఎం గా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి హోటల్ ఎల్లా నుంచి హుటాహుటిన ఢిల్లీకి పయణమయ్యారు. అయన ఢిల్లీ కి వెళ్లేలోపే రేవంత్ ను సీఎం గా ప్రకటించారు కేసీ వేణుగోపాల్. ఇక ఢిల్లీ లో రేవంత్..తన ప్రమాణ స్వీకారానికి సోనియా , రాహుల్ , ప్రియాంక లను ఆహ్వానించబోతున్నారు. ఎల్లుండి (డిసెంబర్ 07) రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.