ఎంపీ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా..స్పీకర్ కు లేఖ అందజేత

తెలంగాణకు కాబోయే సీఎంను అభినందించిన ఎంపీలు

revanth-reddy-resignation-to-mp-post

న్యూఢిల్లీః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి గెలుపొందిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. గురువారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో మంగళవారం సాయంత్రమే దేశ రాజధానికి వెళ్లారు. పార్టీ హైకమాండ్ నేతలతో భేటీ తర్వాత బుధవారం కూడా అక్కడే ఉన్నారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలంటూ సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలతో సహా పలువురు హైకమాండ్ పెద్దలను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

అనంతరం రేవంత్ రెడ్డి పార్లమెంట్ కు వెళ్లారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తాజాగా కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలోనే లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్ కు లేఖ అందజేశారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరైన పలువురు ఎంపీలతో రేవంత్.. రూం నెబర్ 66 లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు.