ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడేలా ఉంది బిఆర్ఎస్ పాలనః రేవంత్ రెడ్డి

revanth-reddy-press-meet

హైదరాబాద్‌ః టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ఏర్ఫాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడేలా బిఆర్ఎస్ పాలన ఉంది అని విమర్శించారు. సచివాలయంలోకి ప్రజాప్రతినిధులను, మీడియా మిత్రులను రానివ్వడం లేదని తెలిపారు. కెసిఆర్‌.. నియంత ముసుగులో ఉన్న క్రిమినల్ పొలిటీషియన్‌ అని ధ్వజమెత్తారు. నిరసనలు తెలపడం ప్రజల ప్రాథమిక హక్కు అన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను ఈ పదేళ్లలో కెసిఆర్ కాలరాశారని మండిపడ్డారు.

‘తెలంగాణ సాధికారతతో రాష్ట్రంలో ఎన్నో మార్పులు చూస్తామన్న యువత ఆకాంక్షలు అడియాశలు అయ్యాయి. కెసిఆర్‌ పాపాలు పండాయి.. మేడిగడ్డ కుంగింది. పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్‌సీ విఫలమైంది. కెసిఆర్‌ ఇచ్చిన పాత హామీలనే అమలుచేయాలని ప్రజలు కోరుతున్నారు. పదేళ్లుగా కెసిఆర్‌ మోసం చేస్తున్నారని ప్రజలకు అర్ధమైంది. బంగారు తెలంగాణ ఫలాలు ఎవరికి అందుతున్నాయి? నిర్దిష్టమైన విధానాలతోనే మేం ప్రజల వద్దకు వెళ్తున్నాం. కెసిఆర్‌ పాలన ఎలా ఉందో.. యువత, రైతులు, మహిళలు బాగా చెబుతారు. విధివిధానాలపైనే ఎన్నికలకు వెళ్దాం.. రండి. చుక్క మందు పోయవద్దు.. పైసలు పంచవద్దు. బిఆర్ఎస్​కు ధైర్యం ఉంటే మా సవాళ్లను స్వీకరించాలి. మేడిగడ్డ పిల్లర్‌ మూడు అడుగులు కుంగిపోయింది. అడుగున ఇసుక ఉందని నీటిపారుదలశాఖ ఇంజినీర్లకు తెలియదా? నీటిపారుదల శాఖను మొదట్నుంచీ హరీశ్‌రావు, కెసిఆర్‌ చూస్తున్నారు.’ అని రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.

సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని రేవంత్ రెడ్డి తెలిపారు. పింఛన్లు, పక్కా ఇళ్లు, నిరుపేదలకు భూమి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు. మైనార్టీలను ఓట్లు వేసే యంత్రాలుగా తమ పార్టీ చూడదని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో మైనార్టీలను భాగస్వాములుగా మారుస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో మైనార్టీలకు గుర్తింపు, గౌరవం ఉంటుందని పేర్కొన్నారు.

“మా ప్రభుత్వం వచ్చాక విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. 2014 నాటి మా ఎన్నికల మ్యానిఫెస్టోనే కెసిఆర్‌ అమలు చేస్తున్నారు. ప్రతి రైతు ఖాతాలో రూ.10 వేలు వేస్తామని 2014లో మేం హామీ ఇచ్చాం. దళారుల చేతుల్లో రైతులు మోసపోకూడదనే కనీస మద్దతు ధర ప్రకటించాం. సహేతుకమైన సూచనలను ఎప్పుడూ తీసుకుంటాం.. పరిశీలిస్తాం. హైదరాబాద్‌ అభివృద్ధికి మూలం.. కాంగ్రెస్‌ విధానాలే. మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం.. ఇరువైపులా వ్యాపార కేంద్రాలు నిర్మిస్తాం.” అని రేవంత్ రెడ్డి అన్నారు.