ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ ..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాసారు. పోలీస్‌ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌ వయో పరిమితి సడలింపు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ వస్తే.. తమకు ఉద్యోగాలు వస్తాయని, తమ భవిష్యత్ బంగారుమయం అవుతుందని యువత పెద్ద ఎత్తున ఉద్యమానికి అండగా నిలిచారు. చదువులు పక్కన పెట్టి, పరీక్షలు బాయ్ కాట్ చేశారు. విద్యా సంవత్సరాలు త్యాగం చేసి, భవిష్యత్ ఏమవుతుందో తెలియని అయోమయ స్థితిలో కూడా తెలంగాణ సాధన కోసం పోరాటం చేశారు.

తెలంగాణ వస్తే.. లక్షలాది ఉద్యోగాలు వస్తాయని మీరు, మీ పార్టీ నేతలు ఆశలు చూపించారు. కానీ గద్దెనక్కి మీరు అన్నీ మర్చిపోయి వారి నోట్లో మట్టి కొట్టారు. దీంతో తెలంగాణ వచ్చాక కూడా ఉద్యోగాల కోసం ఉద్యమించాల్సిన పరిస్థితి ఎదురైంది. నోటిఫికేషన్లు రావడం లేదనే మనో వేదనతో ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డారు అని రేవంత్ అన్నారు. నోటిఫికేషన్లు ఏవీ అని అడిగిన వారిని అణగదొక్కే ప్రయత్నం చేసారని లేఖలో పేర్కొన్నారు. సడలింపు ఇచ్చి కానిస్టేబుల్ ఉద్యోగాల అభ్యర్థులకు వయో పరిమితి సడలింపు ఇవ్వాలని లేఖలో కోరారు. ట్విట్టర్‌లో కేటీఆర్‌కు అభ్యర్దులు అడిగినా పట్టించుకోలేదని, డీజీపీ ఆఫీసు చుట్టూ తిరిగిన ప్రయోజనం లేదంటూ రేవంత్‌ లేఖలో పేర్కొన్నారు.

మీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలలో చూపించిన అలసత్వం కారణంగా ఏజ్ బార్ అయి లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలకు దూరమయ్యారు. ఇప్పుడు మీ ప్రభుత్వం ఇటీవల పోలీస్ విభాగంలో 17 వే పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో కానిస్టేబుల్ పోస్టులు అధికంగా ఉన్నాయి. కానీ మీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా మరో మారు లక్షలాది మంది నిరుద్యోగులు ఈ పోస్టులకు కూడా దూరమయ్యే పరిస్థితి దాపురించింది. నాలుగేళ్ల తర్వాత నోటిఫికేషన్ రావడం, కరోనా నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోవడంతో చాలా మంది ఉద్యోగార్థులు ఎక్కువగా ఉన్న కానిస్టేబుల్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారు.