వైస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన టీడీపీ నేతల ఆగ్రహం

వైస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన ఫై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైస్సార్సీపీ ఒకే సామాజిక వర్గానికి పెత్తనం ఇస్తూ.. ఇతర కులాలను అణగదొక్కుతున్నారని యనమల ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రాన్ని 4 ప్రాంతాలుగా విభజించి.. జగన్ సామాజిక వర్గ నేతలకు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని… ఈ విషయాన్ని తాము ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదన్నారు. పార్టీలో పెత్తనం అంతా సజ్జల, విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డిలదేనన్నారు. బీసీల సంక్షేమం, బీసీల కులగణన, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు గురించి ఏనాడైనా వైస్సార్సీపీ ఎంపీలు మాట్లాడారా అని నిలదీశారు. లాబీయింగ్ కోసమే నిరంజన్ రెడ్డికి పదవులు ఇచ్చిన వాస్తవం ప్రజలకు తెలుసని దుయ్యబట్టారు.

అలాగే ఏపీ కోటాలోని రాజ్య‌స‌భ సీట్ల‌ను తెలంగాణకు చెందిన వ్య‌క్తుల‌కు ఎలా కేటాయిస్తారని అయ్య‌న్న‌ వరుస ట్వీట్స్ చేసారు. పెద్ద‌ల స‌భ‌కి వెళ్లే అర్హ‌త ఏపీలోని 140కి పైగా వున్న బీసీ కులాల‌లో ఏ ఒక్క నేత‌కీ లేదా? అంటూ సీఎం జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించారు. ఏపీలో ఉన్న బీసీలు బీసీలే కాద‌ని మీర‌నుకుంటున్నారా..? నిధులు, నీళ్లు, నియామకాలు నినాదంతో పోరాడి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్ప‌డింద‌న్న అయ్య‌న్న‌… ఏపీకి సీఎం అయిన మొద‌టి రోజునుంచే మీరు ఏపీ నిధులు, నీళ్లు, నియామ‌కాల‌న్నీ తెలంగాణ‌కి దోచిపెడుతున్నారని ఆరోపించారు. నిధులు, విధుల‌తోపాటు కూర్చోవ‌డానికి కుర్చీ కూడా లేని ఉత్తుత్తి 56 కార్పొరేష‌న్లను ఏపీ బీసీల‌కి విదిల్చి, తెలంగాణ వాళ్లకు అత్యున్న‌త రాజ్య‌స‌భ స్థానాలు కట్టబెట్టడం అంటే ఏపీలో వెన‌క‌బ‌డిన త‌ర‌గ‌తుల నేత‌ల‌కి వెన్నుపోటేనంటూ అయ్య‌న్న వ్యాఖ్యానించారు.