భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసి..భావోద్వేగానికి గురై కంటతడి పెట్టిన రేవంత్‌రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ నుండి రూ.25 కోట్లు అందాయని ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు అవాస్తవమని చెబుతూ, రేవంత్ రెడ్డి నేడు భాగ్యలక్ష్మి గుడి వద్ద ప్రమాణం చేశారు. ప్రమాణం అనంతరం రేవంత్ మాట్లాడారు.

మునుగోడు ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. మునుగోడులో బీఆర్‌ఎస్, బీజేపీ వందల కోట్లు ఖర్చు చేశాయని ఆరోపించారు. మునుగోడులో సీఎం కేసీఆర్తో కాంగ్రెస్ ఎలాంటి లాలూచీ పడలేదని స్పష్టం చేశారు. ఏ ఆధారం లేనివారికి దేవుడే ఆధారమని వ్యాఖ్యానించారు. దేవుడిని తాను నమ్ముతానని తనపై అభాండాలు వేశారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌తో గానీ.. కేసీఆర్తో గానీ.. ఎలాంటి లాలూచీ పెట్టుకోలేదని తెలిపారు. కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ప్రకటించారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపణలు అవాస్తవమని రేవంత్రెడ్డి కొట్టిపారేశారు.

ఏ ఆధారం లేని వారికి దేవుడే ఆధారమని రేవంత్ పేర్కొన్నారు. ఆధారాలు చూపించాలని ఈటలకు సవాల్ విసురుతున్నామన్నారు. ఈ తొమ్మిదేళ్లలో తనపై కక్ష పూరితంగా కేసులు పెట్టిన కేసీఆర్ తో ఎలా కలుస్తానని చెప్పారు. తన కూతురు పెళ్లికి వచ్చేందుకు కూడా ఇబ్బందులు పెట్టారన్నారు. ఈటల దేవుడిని నమ్ముతాడో లేదోనని, తాము నమ్ముతామని, అందుకే ఒట్టు వేశానని అన్నారు. కేసీఆర్ నుండి సాయం పొంది ఉంటే తాము సర్వనాశనం అవుతామన్నారు.

ఇక రేవంత్ మాట్లాడుతున్న సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు… ఓ సమయంలో కళ్లు తుడుచుకోవడం కనిపించింది. ఈటల పైన పలు సందర్భాల్లో పరుషపదజాలం ఉపయోగించారు. తన ఆస్తి అంతా పోయినా… కట్ డ్రాయర్ పైన కూడా కేసీఆర్ తో పోరాడుతానని చెప్పారు. తమ కుటుంబం మొత్తం పోరాటానికే సిద్ధంగా ఉందన్నారు. తమ నాలుగు తరాల వరకు వారి పైన పోరాటం చేస్తామన్నారు. తాను చేతకానితనంతో కన్నీళ్లు పెట్టలేదని, ఆవేదనతో కంటతడి పెట్టినట్లు చెప్పారు.

భయం తన రక్తంలో లేదని, తన చివరి రక్తపు బొట్టు వరకు కేసీఆర్ తో పోరాటం తప్పదన్నారు. రాజేంద్రా… నాపై ఇష్టారీతిన మాట్లాడి, తెలంగాణ సమాజం ముందు తలదించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. మున్ముందు ఎవరిని ఎవరు గద్దె దించుతారో తెలుస్తుందన్నారు. రాజేంద్రా.. అందరితో మాట్లాడినట్లు నాతో యథాలాపంగా మాట్లాడవద్దన్నారు.