కాంగ్రెస్ గెలిస్తే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుందిః రేవంత్ రెడ్డి

ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ 14కు 14 సీట్లు గెలవాలన్న రేవంత్ రెడ్డి

revanth-reddy

హైదరాబాద్‌ః ధరణిని రద్దు చేస్తే రైతుబంధు రాదని అబద్దపు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అలంపూర్‌లో కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రూ.100 కోట్లతో జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని కెసిఆర్ గతంలో చెప్పారని, కానీ ఈ రోజు ఆ గుడి పరిస్థితి ఎలా ఉందో అందరూ అర్థం చేసుకోవాలన్నారు. తమ పార్టీ అభ్యర్థి సంపత్ కుమార్ ఇక్కడి నుంచి గెలవాలని అమ్మవారిని దర్శించుకొని వచ్చానన్నారు. తామేదో 24 గంటల విద్యుత్ అని కెసిఆర్ చెబుతున్నారని, కానీ ఉచిత విద్యుత్ ఆలోచన చేసిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. బిఆర్ఎస్ పాలనలో ఇరవై నాలుగు గంటల విద్యుత్ వస్తుందా? సబ్ స్టేషన్‌లకు వెళ్ళి చూద్దామా? అని సవాల్ చేశారు. 24 గంటల ఉచిత విద్యుత్ కాంగ్రెస్ ఇస్తుందన్నారు. 24 గంటల విద్యుత్ వస్తుందని నిరూపిస్తే తాను నామినేషన్ కూడా వేయనని సవాల్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతిని చేస్తే వెంకట్రామిరెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంకట్రామిరెడ్డి తనకు మిత్రుడని, అందుకే పాత మిత్రుత్వం ఉంది కాబట్టి అడుగుతున్నానని… దొర వద్ద జీతానికి కుదిరావా? అని ప్రశ్నించారు. ఆయన చేస్తే రాజకీయాలు చేస్తాడు లేదంటే ఇంట్లో కూర్చుంటాడని భావించామని, కానీ దొర వద్ద జీతానికి కుదురుతావా? అని మండిపడ్డారు. కెసిఆర్ ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదన్నారు. బోయల్ని ఎస్టీల్లో చేరుస్తామని మోసం చేశారన్నారు. ఆ వర్గానికి ఎమ్మెల్సీ ఇచ్చే బాధ్యత తనది అన్నారు. ఇక్కడ ఆర్డీఎస్ సమస్యను పరిష్కరించే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు.

మనం నిధులను అడిగేందుకు సిరిసిల్ల… సిద్దిపేట.. చింతమడక వెళ్లాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్, కెటిఆర్ సహా ఆ కుటుంబమంతా దళారులే అని ఆరోపించారు. ధరణి స్థానంలో మరింత అత్యున్నత ప్రమాణాలతో యాప్ తీసుకు వస్తామన్నారు. ధరణి రద్దు చేస్తే రైతుబంధు ఎందుకు రాదు? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఏ పేదవాడికి వచ్చాయో చూద్దామా? అని నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చోట కాంగ్రెస్ ఓట్లు అడుగుతుంది… డబుల్ బెడ్రూం ఇచ్చినచోట మీరు అడిగేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ పార్టీ 14కు 14 సీట్లు గెలవాలన్నారు.