రాజగోపాల్ రెడ్డి ఫై రేవంత్ రెడ్డి ఫైర్…ఎంగిలి మెతుకులకు ఆశపడ్డాడు

కాంగ్రెస్ పార్టీ కి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి ప్రకటించడం ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆర్థిక లావాదేవీలు, ఎంగిలి మెతుకుల కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడుతున్నాడని రేవంత్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి లాంటి సోనియా గాంధీని.. నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం ఈడీ దాడులతో వేధిస్తుంటే, కన్నకొడుకులా పోరాటం చేయాల్సిన సమయంలో రహస్య ఒప్పందాలు చేసుకొని పార్టీ మారుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి విశ్వాసఘాతుకులను కాంగ్రెస్ పార్టీయే కాదు, యావత్ తెలంగాణ సమాజం క్షమించదని రేవంత్ రెడ్డి అన్నారు.కాంట్రాక్టులు, కమీషన్ల కోసం కన్నతల్లి లాంటి పార్టీపై అనుచితంగా మాట్లాడుతున్నరని అన్నారు. మునుగోడు ప్రజలు సోనియాగాంధీ ప్రతినిధిగా రాజగోపాల్ రెడ్డిని గెలిపించారని..అయితే విశ్వాసఘాతకులుగా ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వాళ్లకు వచ్చిన బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందేనని..కాంగ్రెస్ లేకపోతే బ్రాండీ అమ్ముకునేవారంటూ ఫైర్ అయ్యారు. మునుగోడులో ఉపఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని.. ఈ నెల 5న మునుగోడు నియోజకవర్గంలో సమావేశంతో ఎన్నికల శంఖారావం పూరిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.