రేపు రాష్ట్ర వ్యాప్తంగా రాజగోపాల్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలనీ కాంగ్రెస్ పిలుపు

Congress calls for burning effigies of Rajagopal Reddy

Community-verified icon


కాంగ్రెస్ పార్టీ కి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి ప్రకటించడం ఫై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా రాజగోపాల్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలనీ పిలుపునిచ్చారు. అంతకు ముందు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి ఫై నిప్పులు చెరిగారు. 20 ఏళ్లు సోనియాను తిట్టినోళ్ల కింద పనిచేయాలా, అలాంటి వారికి సీఎం పదవి ఇస్తారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక ఏర్పాటు చేసిన కమిటీల్లో తమ నిర్ణయాలు తీసుకోలేదని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా కొందరు వ్యక్తులు మూర్ఖుల్లా వ్యవహరించి పార్టీని ఆగం చేసిన్రని విమర్శించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుడి కింద పని చేయడం తన వల్ల కాదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఎవరు కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎవరి వశమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. తమకు ఆత్మగౌరవం లేకుంటే ప్రజల కోసం ఎట్ల పనిచేస్తామని ఆవేదనవ్యక్తం చేశారు. పదవులు త్యాగం చేసింది తామైతే.. ఇప్పుడు తామే స్వరాష్ట్రం తీసుకొచ్చినట్లు కొందరు మాట్లాడుతున్నారని రాజగోపాల్ ఆరోపించారు.

మోడీ పాలన గురించి మూడేళ్ళుగా ఆలోచించినట్లు చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కేంద్రంలో మూడోసారి కూడా మోడీ సర్కార్ అధికారంలోకి వస్తదని చెప్పారు. తన రాజకీయ భవిష్యత్తుపై స్పందించిన ఆయన.. ఏ పార్టీలో ఉంటే ప్రజలకు బాగుంటుందో అదే పార్టీలో చేరతానని అన్నారు. తన నిర్ణయం వల్ల ఎవరైనా బాధపడితే క్షమించాలని కోరారు. బీజేపీలో చేరే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అయితే రాష్ట్రంలో అరాచకపాలన పోవాలంటే మోడీ, అమిత్ షా వల్లే సాధ్యమవుతుందని రాజగోపాల్ అభిప్రాయపడ్డారు.

ఇక రాజగోపాల్ వ్యాఖ్యల ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆర్థిక లావాదేవీలు, ఎంగిలి మెతుకుల కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడుతున్నాడని రేవంత్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి లాంటి సోనియా గాంధీని.. నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం ఈడీ దాడులతో వేధిస్తుంటే, కన్నకొడుకులా పోరాటం చేయాల్సిన సమయంలో రహస్య ఒప్పందాలు చేసుకొని పార్టీ మారుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విశ్వాసఘాతుకులను కాంగ్రెస్ పార్టీయే కాదు, యావత్ తెలంగాణ సమాజం క్షమించదని రేవంత్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టులు, కమీషన్ల కోసం కన్నతల్లి లాంటి పార్టీపై అనుచితంగా మాట్లాడుతున్నరని అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీలోనే ఉంటారు. ఆయన క్రమ శిక్షణ కలిగిన నేత. పార్టీలో ఎన్నో హోదాలలో పనిచేశారు. మునుగోడులో కాంగ్రెస్ ను గెలిపించేందుకు కృషి చేస్తారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలబడతాడు అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.