కాంగ్రెస్ పార్టీ కి రాజగోపాల్ రెడ్డి రాజీనామా

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేస్తారా లేక కొనసాగుతారా..? అనేదానిపై గత రెండు వారాలుగా మీడియాలో హాట్ టాపిక్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రాజగోపాల్ ఆ ఉత్కంఠకు తెరదించారు. కాంగ్రెస్ పార్టీ కి , అలాగే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామాతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు. త్వరలో స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని చెప్పుకొచ్చారు.

మునుగోడు ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజగోపాల్​రెడ్డి వెల్లడించారు. మాటలు పడి,నిందలు మోసి, ఆత్మగౌరవం లేకుండా పదవిలో కొనసాగాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసారు. ఉప ఎన్నిక వస్తే ఎవరిని గెలిపించాలన్నది ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసమే తాను ఈ పోరాటం చేయనున్నట్లు చెప్పారు. నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అమ్ముడుపోవడం తన రక్తంలో లేదన్న ఆయన. నీచ రాజకీయాలు స్వార్థం కోసం కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని వాపోయారు. మూడున్నరేళ్లుగా మనుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని రాజగోపాల్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

మునుగోడుకు ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదని ఆరోపించారు. కొత్తగా ఇస్తామన్న పింఛన్లు, రేషన్‌ కార్డులు, పోడు భూములకు పట్టాలు, నిరుద్యోగ భృతి, సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకునే వారికి ఆర్థికసాయం.. ఇలా ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు ఇస్తూ మిగతా పథకాలను రద్దు చేశారని ఆక్షేపించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి అపాయింట్‌మెంట్‌ ఇవ్వని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నారన్నారు. నల్గొండ జిల్లా ప్రాజెక్టులను కేసీఆర్‌ పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు అని ప్రజలకు అర్థమైందని రాజగోపాల్​రెడ్డి చెప్పుకొచ్చారు.

అధిష్టానం తప్పుడు నిర్ణయాల వల్ల కాంగ్రెస్ నష్టపోయిందని రాజగోపాల్ ఆరోపించారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా హైకమాండ్ కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే తనకు అభిమానం ఉందని, అయితే 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా పిలిచి మాట్లాడకపోవడం బాధించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా విమర్శలు చేయనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో కొనసాగమని అంటున్నారని, అయితే కేసీఆర్ ను ఢీకొట్టడం ఆ పార్టీ వల్ల కాదని అన్నారు. తనపై చర్యలు తీసుకుంటామంటున్న నేతలు తాను చేసిన తప్పేంటో చెప్పాలని నిలదీశారు.