కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసిన రేవంత్ రెడ్డి

కెసిఆర్ పూర్వీకుల గ్రామ ప్రజలు ఇచ్చిన డబ్బుతో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్

Revanth Reddy filed nomination in Kamareddy

కామారెడ్డి: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డి ఆర్వో కార్యాలయంలో ఈరోజు నామినేషన్ వేశారు. రేవంత్ రెడ్డి వెంట ఆర్వో కార్యాలయానికి కర్ణాటక సిఎం సిద్ధరామయ్య వెళ్లారు. రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది. లైన్లలో ఉన్నవారికి నామినేషన్లు వేసే అవకాశం కల్పించారు. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. ఈనెల 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు.

కాగా, కెసిఆర్ పూర్వీకుల గ్రామమైన కొనాపూర్‌కు చెందిన ప్రజలు కొంత డబ్బులను  విరాళాల రూపంలో సేకరించి రేవంత్ రెడ్డికి అందించారు. ఈ డబ్బును రేవంత్ రెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు వినియోగించారు. రేవంత్ రెడ్డి ఈ నెల 6న తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో నామినేషన్ దాఖలు చేశారు. కాగా, గతంలో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి షబ్బీర్ అలీ ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటి వరకు కామారెడ్డి నుంచి పోటీచేసిన షబ్బీర్ అలీ ఈసారి నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలో నిలిచారు.