రాష్ట్ర ప్రజలను అవమానించిన మోడీ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారు..? – రేవంత్

రాష్ట్ర ప్రజలను అవమానించిన మోడీ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారు..? అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ప్రశ్నించారు. ఎనిమిదేళ్లలో తెలంగాణకు కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వకుండా.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా.. రెండు తెలుగు రాష్ట్రాలను మోడీ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బిజెపి ఎందుకు సమావేశాలు పెడుతున్నారో అర్ధం కావట్లేదని రేవంత్ అన్నారు.

అలాగే సీఎం కేసీఆర్ ఫై కూడా రేవంత్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చిల్లర పంచాయతీలు పెట్టుకుంటున్నారు.. ఫ్లెక్సీల కోసం కొట్టుకోవడమా..? విభజన చట్టంలోని అంశాలపై చర్చ పెట్టాలి. సీఎం కేసీఆర్ చిల్లర విషయాలు మానుకోవాలి అని రేవంత్ అన్నారు. అగ్నిపథ్​పై మీ స్టాండ్ ఏంది..? అసెంబ్లీలో అగ్నిపథ్​పై వ్యతిరేకంగా తీర్మానం చేయాలి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కలవడానికి కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్​ని కలిసిన వాళ్లని తాము కలవమని ఉద్ఘాటించారు.

పార్లమెంట్​ తలుపులు మూసి మరీ కాంగ్రెస్​ తెలంగాణ ఇస్తే.. తల్లిని చంపి పిల్లను ఇచ్చారని పార్లమెంట్‌లో మోడీ మాట్లాడారని గుర్తు చేశారు. తెలంగాణను గుర్తించడానికి కూడా మోడీ ముందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. మంత్రి పదవుల్లో దక్షిణ భారతదేశానికి ప్రాధాన్యమివ్వలేదన్నారు. తెలంగాణలో ఉన్న కేంద్రమంత్రి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని.. ఏపీకి అసలు మంత్రే లేడని ఎద్దేవా చేశారు. వెంకయ్యను ఉపరాష్ట్రపతి పదవి నుంచి దించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. తెలుగువారిని మోడీ అవమానిస్తున్నారని రేవంత్​రెడ్డి అన్నారు. ఇక కొండా విశ్వేశ్వర రెడ్డి తనకు మిత్రుడన్న రేవంత్​.. బిజెపి చేరిన కొద్దికాలానికి ఆయనే వెనుదిరిగి చూస్తారని వ్యాఖ్యానించారు.