మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్​నాథ్ షిండే

మహారాష్ట్రలో షిండే ప్రభుత్వం కొలువుదీరింది. శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ సమక్షంలో షిండే ప్రమాణం చేయగా, ఉప ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఏక్ నాథ్ను ప్రమాణ స్వీకారం కోసం వేదికఫై పిలవగానే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహా వికాస్ అఘాడీ సర్కారుపై తిరుగుబాటు చేసి.. ప్రభుత్వం కుప్పకూలేలా చేసిన షిండే, బిజెపి తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చారు. అనూహ్యంగా షిండేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు ఫడ్నవీస్ సంచలన ప్రకటన చేశారు. తాను ప్రభుత్వంలో భాగం కాబోనని తొలుత ఫడ్నవీస్ ప్రకటించగా.. బిజెపి హైకమాండ్ కోరిక మేరకు ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.

షిండే రాజకీయం చూస్తే.. 1964 ఫిబ్రవరి 9న ఏక్‌నాథ్‌ షిండే జన్మించారు. యశ్వంతరావు వాన్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. 1980లో శివసేన కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి, 1997లో థానే మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు. 2004లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోప్రి పచ్చపాఖాది నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత వరసగా నాలుగుసార్లు అక్కడినుంచే గెలుస్తూ వచ్చారు. 2014లో ప్రతిపక్ష నేతగా, శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా పనిచేశారు. 2019 నవంబర్‌ 28 నుంచి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ఆధ్వర్యంలో ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.