కారేపల్లి బాధితులను పరామర్శించిన రేణుక చౌదరి

ఖమ్మం జిల్లా చీమలపాడులోని ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే బాధిత కుటుంబాలను మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి పరామర్శించారు. నిన్న చనిపోయిన సందీప్ ని హుటాహుటిన హాస్పిటల్ నుంచి తరలించి దహన సంస్కారాలు చేయడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందన్న ఆమె.. బాధిత కుటుంబాలను ఎక్స్ గ్రేషియోతో పాటు వారి పిల్లలకు చదువును ఉచితంగా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు ఈ ఘటనను తప్పుదోవ పట్టించి అబద్ధాలు ఆడుతున్నారని రేణుక చౌదరి ఆగ్రహం వ్యక్తం చేసారు.

ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళన పేరుతో కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. బుధువారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమ‌ల‌పాడు వ‌ద్ద నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ స‌మ్మేళనానికి బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు, వైరా ఎమ్మెల్యేతో పాటు ప‌లువురు ప్రజాప్రతినిధులు హాజ‌ర‌య్యారు.

ఈ క్రమంలో నేత‌ల‌ను ఆహ్వానిస్తూ బిఆర్ఎస్ కార్యక‌ర్తలు బాణాసంచా పేల్చారు. దీంతో ఆ నిప్పుర‌వ్వలు ఎగిరిప‌డి స‌భా ప్రాంగ‌ణానికి 200 మీట‌ర్ల దూరంలో ఉన్న గుడిసెపై ప‌డ్డాయి. దీంతో గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండ‌ర్‌కు మంట‌లు అంటుకుని అది పేలిపోయింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ప్రమాదానికి గురయ్యారు. ఘటనా స్థలంలో రమేశ్, మంగు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు.