సమాచారాన్ని లీక్ చేయొద్దు..వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ: పార్లమెంటరీ ప్యానెల్స్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని మీడియాకు లీక్ చేయొద్దని ఉపరాష్ర్టపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల చైర్‌పర్సన్‌లు, కమిటీ సభ్యులను కోరారు. ఈ మేరకు ప్యానెల్ చీఫ్‌లకు ఆయన లేఖ రాశారు. కమిటీల చర్యలను, చర్చించే అంశాలను, శాసన బిల్లులను మీడియా తమ రిపోర్టింగ్‌లో చర్చిస్తూ, ప్రశ్నిస్తున్నట్లుగా తాను గమనించినట్లు చెప్పారు. కమిటీ సమావేశాల కార్యకలాపాలు గోప్యంగా ఉంటాయని మనందరికీ తెలుసన్నారు.
కమిటీ సమావేశాల నిర్ణయాలను ఏ ఒక్కరితోనూ ప్రత్యక్షంగా గానీ లేదా పరోక్షంగా గానీ పంచుకునేందుకు అనుమతి లేదన్నారు. కమిటీ నివేదికలు, తీర్మానాలు సభలో ప్రవేశపెట్టే కంటే ముందే బహిర్గతపరిస్తే అది సభాధికారాన్ని ఉల్లంఘించినట్లేనన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల అధ్యక్షులకు కొన్నిరోజుల క్రితం ఇలాంటి లేఖే రాశారు. ప్యానెల్ సమావేశాలను రహస్యంగా ఉంచాల్సిందిగా కోరారు. లోక్‌సభ స్పీకర్‌ను అనుసరించి రాజ్యసభ చైర్మన్ స్టాండింగ్ కమిటీల చైర్‌పర్సన్లు, సభ్యులకు లేఖ రాశారు. నివేదికలు బహిర్గతమయ్యేవరకు గోప్యతను పాటిస్తూ మీడియాకు అనవసరంగా సమాచారాన్ని లీక్ చేయొద్దని కోరారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/