అందరం ఒకే పడవలో పయనిస్తున్నాం

‘మనస్విని’ మానసిక సమస్యలకు పరిష్కారం

sad
sad

మేడమ్‌! నా వయసు 50 సంవత్సరాలు. మాకు ఇద్దరు పిల్లలు. మాకు వ్యాపారంలో నష్టం వచ్చింది. మా అబ్బాయి పెళ్లి చేసుకోవటానికి అంగీకరించటం లేదు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ మధ్యనే నా భర్తకు తీవ్ర అనారోగ్యం వచ్చింది. ఏమి చెయ్యాలో తోచటం లేదు. పరుపు పోతోందని భయంగా ఉంది. ఈ మధ్యనే మా చుట్టాల పలకరింపులు కూడా బాధగా అనిపిస్తున్నాయి మా ఆయన అనారోగ్యం వల్ల. ఈ బాధల నుండి బయటపడటం ఎలా? కొంచెం వివరించండి. – శైలజారాణి

మీరు తప్పక ఈ బాధల నుండి బయటపడగలరు. అన్నింటికీ మించి, ధైర్యంగా ఉండాలి. భయం అనేది పెనుభూతం కాకూడదు. ఆత్మవిశ్వాసంతో ఉండాలి.

ఇలాంటి సమస్యలు అందరికీ వస్తుంటాయి. పోతుంటాయి. అందువల్ల మీ కొక్కరికే ఇలా జరుగుతుందని, పరువుపోతుంది అనుకోవద్దు.

అందరూ ఒకే పడవలో పయనిస్తున్నాము. జీవితం అనే నౌకలో కష్టసుఖాలు, మంచి చెడులు, సర్వసామాన్యమే. అనారోగ్యానికి మంచి వైద్యం ఇప్పించండి.

ఆర్ధిక సమస్యలు కూడా తొలగిపోతాయి. పథకం ప్రకారం మనం ఖర్చులు తగ్గించుకోవాలి. స్నేహితుల, బంధువుల ఆసరాతో ఆర్ధిక సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

జీవిత అవసరాలు చాలా తక్కువ. కోరికలను తగ్గించుకోవాలి. సానుకూంగా ఆలోచించాలి. మంచి ఆలోచనల వల్ల మంచి అనుభూతులు కలుగుతాయి.

చెడు, వ్యతిరేక ఆలోచనల వల్ల చెడు అనుభూతులు, బాధలు, భయం కలుగుతాయి. అందువల్ల సానుకూలంగా ఆలోచించటం తప్పనిసరి. కొంచెం ఓపికపడితే అన్ని సమసిపోతాయి.

ఇందులో అనుమానం లేదు. ఈ సమస్యల నుండి నేర్చుకోవలసింది చాలా ఉంటుంది. దానిని నేర్చుకుని, ఆత్మవిశ్వాసంతో, స్పష్టతతో, అవగొహనతో, మంచి నిర్ణయాలు తీసుకోవాలి.

జీవితం అమూల్యమైనది. దానిని చక్కగా ఆనందించాలి. అంతే తప్ప, సమస్యల సుడిగుండంలో ఇరుక్కుపోకూడదు. తెలివిగా, చాకచక్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి.

వర్తమానంలో ఆనందంగా జీవించాలి. ఇది తప్పక చేయవలసిన పని.

తొందరపాటు పనికిరాదు

మేడమ్‌! నా వయసు 40 సంవత్సరాలు. నాకు ఇద్దరు అమ్మాయిలు. మా పెద్దమ్మాయి పెళ్లి అయి విడాకులు కూడా తీసుకుంది.

దానివల్ల నేను తీవ్ర మనస్తాపానికి గురై, అనారోగ్యం పాలయ్యాను. ఇప్పుడు వైద్యం తీసుకుంటున్నాను.

కొంచెం ఆర్ధిక ఇబ్బందులు కూడా ఉన్నాయి. మరల మా అమ్మాయి పెళ్లి చేయవచ్చా? మళ్లీ పెళ్లి చేస్తే ఆమె జీవితం బాగవుతుందా? కొంచెం వివరించండి. ప్లీజ్‌. – నీరజ

మీరు తప్పక మీ అమ్మాయికి తిరిగి వివాహం చేయవచ్చు. అందులో తప్పులేదు. కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆమె సంసిద్ధత, వరుని గుణగణాలు అన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నాకే వివాహం చేయాలి.

తగు వివరాలు తెలుసుకోకుండా పునర్వివాహం చేయవద్దు. జీవితంలో ముఖయమైన నిర్ణయాలను, చాలా ఆలోచించి అవగాహనతో, స్పష్టతతో, తగు సమయంలో తగు నిర్ణయాలు తీసుకోవాలి.

తొందరపాటు పనికిరాదు. అలానే మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆనందంగా ఉంటే, ఏ అనారోగ్యం ఉండదు.బాధలతోనే ఆరోగ్యం చెడిపోతుంది.

అందువల్ల శారీరక, మానసిక ఆరోగ్యాలు చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా చూచుకోవాలి. ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించాలి.

మంచి అనుభూతులతో జీవితాన్ని ప్రశాంతంగా సంతృప్తిగా జీవించాలి. సానుకూల దృక్పథం చాలా అవసరం.

గృహ వాతావరణం, ఆనందంగా, మలచుకోవాలి. ఆందోళన, ఒత్తిడి, భయం దగ్గరకు రానీయకూడదు. ఇవన్నీ జరగాంటే ప్రయత్నపూర్వకంగా శ్రద్ధ తీసుకోవాలి.

ఆశావహ దృక్పథంతో ఉండాలి. జీవన నైపుణ్యాలు నేర్చుకోవాలి. మానసికంగా మంచి అనుభూతులు పంచుకోవాలి.

ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. ధైర్యంతో వర్తమానంలో ఆనందంగా, ఉత్సాహంగా జీవితం గడపాలి. ఇదంతా తప్పనిసరిగా చేయాలి.

-డాక్టర్‌ ఎం. శారద, సైకాలజీ ప్రొఫెసర్‌

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/