మునుగోడులో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు

మునుగోడు లో మద్యం ఏరులై పారుతుంది. ఉదయం నుండి అర్ధరాత్రి వరకు పది మంది లో ఆరుగురు మద్యంతో ఊగిపోతున్నారు. దీనికి కారణం ఉప ఎన్నికే. మునుగోడు ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతూ ఓటర్లకు ఏంకావాలంటే అది ఇస్తున్నారు. డబ్బు , మద్యం, భోజనం ఇలా అని సమకూరుస్తుండడంతో ఓటర్లు ప్రతి రోజు పండగ చేసుకుంటున్నారు.

ఇక మునుగోడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి రోజూ మద్యం సరఫరా చేస్తోన్నారు. ఈ పరిణామాలతో మునుగోడు నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. అబ్కారీ శాఖ లెక్కల ప్రకారం అక్టోబర్ 22వ తేదీ వరకు రూ.160.8 కోట్ల విలువ చేసే మద్యం అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఎన్నికల పోలింగ్‌కు ఇంకా 8 రోజులు మాత్రమే సమయం ఉండటంతో మద్యం విక్రయాలు రెట్టింపు స్థాయిలో పెరిగే అవకాశముందని అంటున్నారు. ఈ నెల ముగిసే నాటికి దాదాపు రూ.200 కోట్లకుపైగా మద్యం విక్రయాలు చేరుకునే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అత్యధికంగా మునుగోడు మండలంలో మద్యం విక్రయాలు జరిగినట్లు చెబుతుండగా.. అత్యల్పంగా గట్టుప్పల్ మండలంలో జరిగినట్లు తెలుస్తోంది. నల్లొండ జిల్లా మొత్తం మీద చూసుకుంటే ప్రతి నెలా సుమారు రూ.132 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతూ ఉంటాయి. కానీ మునుగోడు ఉపఎన్నిక క్రమంలో ఆ ఒక్క నియోజకవర్గంలోనే ఈ నెలలో రూ.200 కోట్లపైగా మద్యం అమ్మకాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద మద్యం ప్రియులకు మునుగోడు ఉప ఎన్నిక బాగా కలిసివస్తుంది. కేవలం మద్యం ప్రియులకు కాదు హోటల్స్ , లాడ్జ్ లకు కార్య కర్తలకు ఇలా ప్రతి ఒక్కరు లాభ పడుతున్నారు.